కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, జనవరి 21(విజయ క్రాంతి): జిల్లాలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పర్ పల్లి రెండో వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభ, వార్డు సభలలో ప్రదర్శనలో ఉంచిన జాబితాను చూసుకొని ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికార దృష్టికి తీసుకురావాలన్నారు.
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ప్రస్తుతం వార్డు సభ, గ్రామసభలలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ సభలలో దరఖాస్తు చేయడానికి వీలుకాకుంటే ఎప్పుడైనా ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.
ఇది నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. అనంతరం షామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను గుర్తించమన్నారు.
ఈ కార్యక్రమాల్లో షామీర్పేట తహసిల్దార్ యాదగిరి, ఎంపీడీవో మమతా బాయి, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తదితరులు పాల్గొన్నారు.