30-03-2025 12:00:00 AM
తెలుగువారికి ఆనందదాయకమైన పండుగలలో ఉగాది మొదటిదేకాక అత్యంత విశిష్టమైంది. వసంత రాత్రులలో వచ్చే తొలిరోజు ఇదే. మన ప్రతి పండుగలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఏ కారణం, ప్రయోజనం లేకుండా పెద్దలు ఏ పండుగలను ఏర్పాటు చేయలేదు. వాటిని తెలుసుకొని ఆచరించగలిగితే జీవితం సార్థకమేకాక సుఖవంతమవుతుంది.
కాలాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తే ప్రతి రోజూ ఒక పండగే. ప్రత్యేకించి సంవత్సరం ఆరంభమయ్యే ఉగాదినాడు ప్రత్యక్షదైవమైన శ్రీసూర్యనారా యణుని ఆరాధన విశేష ఫలాన్నిస్తుంది. ఈరోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటిని ‘వసంత నవరాత్రులు’ అంటారు. లలిత, దుర్గాది దేవతలను ఈ తొమ్మిది రోజులూ విధిగా ఆరాధించడం పుణ్యకార్యం. ఇతర పండుగలవలె వ్రతాలు, పూజలు, ఒక దేవతను ఉద్దేశించి చేసే పండగ కాదు ఉగాది. ‘యుగాది’ అనే సంస్కృత పదానికి తెలుగు రూపం ఉగాది.
వసంతంలో ప్రకృతి పులకిస్తుంది. చెట్లు చిగురిస్తాయి. పూలు తొడిగి, పిందెలు వేసి, కాయలు కాసి ఫలవంతమవుతాయి. నూతన సృష్టి అంకురిస్తుంది. జగత్తు అంతటినీ ఒక చైతన్యం కదిలిస్తూ ఉంటుంది. ఈ వేళలోనే కోకిలలు ప్రకృతి నిండుతనానికి పరవశించి పోతాయి. నూతనత్వాన్ని స్వాగతిస్తూ అద్భుత రాగాలతో గీతాలాపనలు చేస్తాయి.
క్రోధ చింతనకు స్వస్తి చెబుదాం
ఈ చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది (సంవత్సరాది). బ్రహ్మదేవుడు ఇదేరోజు సూర్యోదయ వేళ సృష్టి చేశాడు. ఇంతటి శుభదినం కాబట్టి, ఉదయాన్నే ఇంటిల్లిపాది నువ్వులనూనెతో తలంటు స్నానం చేయాలి. కొత్త దుస్తులు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర ఉపయోగించడం ఆచారం. ఎండకాలం ప్రారంభమవుతుంది కనుక ఇప్పటి నుంచి గొడుగు వాడకం మొదలవుతుంది. ఇంటి ముంగిట మామిడి తోరణాలు కట్టాలి. విధిగా వేపపూతతో కూడిన ఆరు రుచుల పచ్చడిని దేవుడికి నివేదించి, ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఈ పచ్చడినే ‘నింబ కుసుమ భక్షణం’ అంటారు. ఇదొక ఔషధం అనికూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈవేళ పంచాంగ పూజ చేయాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం (వినడం) మన ఆచారం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం. దీనిని శ్రీమహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి. ఇదే సందర్భంలో రైతులు నాగలికి ఉన్న పాత తాళ్లు తీసి, పసుపు రాసిన కొత్త తాళ్లు కడతారు. నాగలి కాడికి రావి మండలు కడతారు. ఎడ్లకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూజిస్తారు. ఇలా ఎంతో ఆనందంతో ఏరువాక సాగిస్తారు.
ఈ ఉగాదినాటికి క్రోధికి వీడ్కోలు పలికి, విశ్వావసుకు స్వాగతం చెబుతున్నాం. మానవులంతా క్రోధాలు, కోపావేశాలకు ఇక స్వస్తి చెప్పవలసిందిగా కాలం మనకు సూచిస్తున్నది. ఇది ‘విశ్వావసు’ సంవత్సరం కనుక, ఈ సందర్భంగా సమస్త విశ్వశ్రేయస్సుకు స్వాగతం పలుకుదాం. ‘విశ్వవాసు’గా విశ్వానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కటాక్షం ఈ కాలంలో ప్రతీ ఒక్కరికీ సిద్ధిస్తుందని వేదపండితులు అంటున్నారు. లక్ష్మీదేవి కరుణ ఈ ఏడాది పొడుగునా ప్రతీ ఒక్కరికీ లభించాలని కూడా అందరం కోరుకుందాం.
సకల కార్యసిద్ధికి శుభారంభం
‘యుగస్య ఆది’ ఉగాది. అంటే, నక్షత్ర గమనం సృష్టికి ఆది, యుగాదికి ఆరంభం. ఏ పనికైనా ఒక మంచి ప్రారంభం కావాలి. ఉత్తమ ప్రారంభం కార్యసిద్ధికి సంకేతం. ఇలా అన్ని కార్యాల సిద్ధికోసమే సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. ఏడాది అనే కాలరథానికి ఉత్తరాయనం, దక్షిణాయనం అని రెండు చక్రాలు. ప్రతీ సంవత్సరంలో వచ్చే మొదటి ఋతువు వసంతం. తొలి మాసం చైత్రం. మొట్టమొదటి పక్షం శుక్లం, తొట్టతొలి తిథి పాడ్యమి. కనుకే, ఈ రోజు ఉగాది పర్వదినం జరుపుకుంటాం.
“చైత్రే మాసి జగద్బ్రహ్మ ఏవర్లిప్రధమేహ ని శుక్లపక్షే సమగ్రంతు” అన్నారు పెద్దలు. సమస్త జగత్తును పరమాత్మ సృష్టించ ఆరంభించాడని పురాణాలు పేర్కొన్నాయి. భారతీయ సంప్రదాయంలో పండుగలు లేదా పర్వదినాలు అన్నీ అంతరిక్షంలోని గ్రహగమనాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఉగాది పండుగ సందర్భంగా ఏయే కాలాల్లో లభించే వస్తువులను ఆయా కాలాల్లో వాడాలి. అప్పుడే మనకు శారీరక మానసిక ఉత్తేజం సిద్ధిస్తుందని ప్రకృతి శాస్త్రం చెబుతున్నది. దాదాపు అన్ని మన పండుగలూ ఈ అంశానికి విస్తృత ప్రాధాన్యమిచ్చాయి. ఈ మేరకు మనం పాటించే ఆచార, సంప్రదాయాలలో ఆరోగ్య సూత్రాలు నిభిడీకృతమై ఉన్నాయి.
ఉగాది రోజు ఏం చేయాలి? పచ్చడిని ఎలా తయారు చేయాలి? వంటి విశేషాలను మన పూర్వీకులు ఏనాడో నిర్దేశించారు. ఆ మేరకే వాటిని తరతరాలుగా మనమంతా పాటిస్తూ వస్తున్నాం.
పంచకృత్య నిర్వహణ
ఉగాది సందర్భంగా పంచకృత్యాల (కార్యాలు)ను మన శాస్త్రాలు పేర్కొన్నాయి. అవి: 1. అభ్యంగన స్నానం 2. నూతన వస్త్రధారణ 3.నింబ కుసుమ భక్షణ 4. దేవాలయ దర్శనం 5. పంచాంగ శ్రవణం. ఈ పండుగ నాడు చేసే ప్రత్యేకమైన ‘పచ్చడి’ని ఎందుకు స్వీకరించాలి? అన్న దానికీ శాస్త్రీయ సమాధానాలు ఉన్నాయి.