- స్వదేశానికి హర్మన్‌ప్రీత్ సేన
- పారిస్‌లోనే గోల్ కీపర్ శ్రీజేశ్
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి చేరుకుంది. ఈ ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మన హాకీ వీరులకు ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో భారత్ 2 తేడాతో స్పెయిన్‌పై నెగ్గి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం నిలబెట్టుకొని రికార్డుల కెక్కింది.
హాకీ జట్టు స్వదేశానికి రానుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఉద యం నుంచే ఎయిర్‌పోర్టుకు క్యూ కట్టారు. పతకాలతో తిరిగొచ్చిన హర్మన్‌ప్రీత్ సేనకు అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం డప్పులు,డోలు శబ్దాలు.. కళాకారుల నృత్యాలతో ఎయిర్ పోర్టు ప్రాంగణం సందడిగా మారిపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సహా మరికొంతమంది క్రీడాకారులు నృత్యాలతో అలరించారు.
మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళి
శనివారం స్వదేశానికి వచ్చిన భారత హాకీ జట్టు నేరుగా ఢిల్లీలోని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. అక్కడ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ కార్యక్ర మం ముగిసిన అనంతరం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియానికి వెళ్లిన టీమిండియా ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి అతనికి నివాళి అర్పించారు. అనంతరం భారత హాకీ జట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాండవీయ కాంస్యం గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్ల 40 లక్షల చెక్కును నజరానాగా అందించారు. ఇక హాకీకి రిటైర్మెంట్ ప్రకటించిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ సహా పలువురు క్రీడాకారులు పారిస్‌లోనే ఉండిపోయారు. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మనూ బాకర్‌తో కలిసి శ్రీజేశ్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. శ్రీజేశ్‌తో పాటు అమిత్ రోహిదాస్, రాజ్‌కుమార్ పాల్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, సంజయ్‌లు కూడా పారిస్‌లోనే ఉండి పోయారు.