- మూరత్ ట్రేడింగ్‌లో పెరిగిన మార్కెట్
- సెన్సెక్స్ 335 పాయింట్లు అప్
ముంబై, నవంబర్ 1: శుక్రవారం జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో హిందూ నామ సంవత్సరమైన 2081కు మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. దీపావళికి మొదలయ్యే కొత్త ఏడాది సందర్భంగా స్టాక్ ఎక్సేంజ్‌లు సాయంత్రం ఒక గంటపాటు ప్రత్యేకంగా మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి.
తాజాగా ఈ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 79,724 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ మూరత్ ట్రేడింగ్‌లో గ్యాప్‌అప్‌తో మొదలైన సెన్సెక్స్ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలవరకూ జరిగిన ట్రేడింగ్ సమయమంతా లాభాల్లోనే కొనసాగింది. 80,023 పాయింట్ల గరిష్ఠస్థాయి, 79,655 పాయింట్ల కనిష్ఠస్థాయిల మధ్య కదలింది.
ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,304 పాయింట్ల వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఆయిల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి.సంవత్ 2080 చివరి రోజైన గురువారం సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా, నిఫ్టీ 150 పాయింట్లకుపైగా తగ్గాయి.
కొనసాగుతున్న ఎఫ్‌పీఐల నిధుల తరలింపు
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) నిధుల తరలింపు కొనసాగుతున్నది. కిత్రం ట్రేడింగ్ రోజైన గురువారం రూ.5,813 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్‌లో నెల మొత్తంమీద ఎఫ్‌పీఐలు భారత్ నుంచి రూ.1 లక్ష కోట్ల మేర నిధుల్ని ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ నెలలో సెన్సెక్స్ 4,910 పాయింట్ల భారీ పతనాన్ని చవిచూసింది. నిఫ్టీ 1,605 పాయింట్లు కోల్పోయింది.
ఏడాదిలో రూ.124 లక్షల కోట్లు
పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముగిసిన సంవత్ 2080లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 14,484 పాయింట్లు ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4,780 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఈ ఏడాది మొత్తం ఇన్వెస్టర్ల సంపద రూ.124.42 లక్షల కోట్లు పెరిగి రూ.4,44,71,429.92 కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) చేరింది.
ఎం అండ్ ఎం టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 3.29 శాతం పెరిగింది. ఈ కంపెనీ అక్టోబర్ నెలలో రికార్డుస్థాయిలో కార్లను విక్రయించినట్లు వెలువడిన గణాంకాలతో ఈ షేరుకు కొనుగోలు మద్దతు లభించింది. అదానీ పోర్ట్స్ 1.26 శాతం, టాటా మోటార్స్ 1.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.92 శాతం చొప్పున పెరిగాయి.
నెస్లే, ఎన్టీపీసీ, రిలయన్స్, ఐటీసీ, టైటాన్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు సైతం లాభాలతో ముగిసాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో ఆటోమొబైల్ ఇండెక్‌స 1.15 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 1.10 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.91 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.69 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం చొప్పున లాభపడ్డాయి.