హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలతో రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన కోసం సన్నహాక సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన రహదారులపై రేవంత్ రెడ్డి, అదానీ కలిసి ఉన్న ఫ్లెక్సీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతూ తన స్నేహితుడు అదానీ కోసమే పని చేస్తున్నారు తప్ప, ప్రజల కోసం మోడీ పనిచేయడం లేదని విమర్శిస్తున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ, అదానీపై పలుమార్లు విరుచుకుపడిన విషయం తెలిసిందే.