calender_icon.png 27 September, 2024 | 7:00 AM

ఒలింపియాడ్ వీరులకు ఘన స్వాగతం

25-09-2024 12:00:00 AM

భారత్‌లో అడుగుపెట్టిన గుకేశ్, ప్రజ్ఞా, వైశాలీ

చెన్నై: ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచిన భారత బృందం స్వదేశానికి చేరుకుంది. తొలి విడతలో తమిళనాడుకు చెందిన గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, ఆర్. వైశాలీతో పాటు పురుషుల జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణ్ మంగళవారం ఉదయం చెన్నై ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా గుకేశ్‌తో పాటు ప్రజ్ఞానంద, వైశాలీలకు ఘన స్వాగతం లభించింది. నవంబర్‌లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఎదుర్కోనున్న గుకేశ్.. ఈ విజయం తనకు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం నెగ్గడం తనకు బూస్టప్ అని తెలిపాడు. ‘చెస్ ఒలింపియాడ్‌ను తొలిసారి గెలవడం సంతోషంగా అనిపించింది. ఈ ప్రదర్శన మాకు గర్వకారణం’ అని గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞా చెప్పుకొచ్చాడు. ‘గతేడాది చెన్నై ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గాం.

ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బుడాపెస్ట్‌కు వెళ్లాం. అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని గ్రాండ్‌మాస్టర్ వైశాలీ పేర్కొంది. గుకేశ్, అర్జున్, ప్రజ్ఞానంద, హరిక్రిష్ణ, విదిత్‌లో కూడిన పురుషుల బృందం.. హారిక, దివ్య, తానియా, వంతిక, వైశాలీతో కూడిన మహిళల బృందం తొలిసారి స్వర్ణ పతకాలు నెగ్గాయి.