calender_icon.png 17 October, 2024 | 2:48 AM

సమస్యలతో జోడేఘాట్‌కు స్వాగతం

17-10-2024 12:21:15 AM

ఆదివాసీలకు తప్పని నీటి తిప్పలు

రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు 

పూర్తికాని డబుల్ బెడ్ రూం ఇండ్లు

నేడు అధికారికంగా కుమ్రంభీం వర్ధంతి

హాజరు కానున్న మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): జల్, జంగల్, జమీన్ నినా దంతో నిజాం నిరంకుశ పాలనపై వీరోచిత పోరాటం చేసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం గడ్డ నేటికీ సమస్యలతో విలవిలలాడుతున్నది. ప్రభుత్వాలు మారినా జోడేఘట్‌లో సమస్యలు మాత్రం తీరడం లేదు.

తెలంగాణలో కుమ్రంభీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ గ్రామంలో సమస్యలను మాత్రం తీర్చడం లేదు. 50 కుటుంబాలు నివాసం ఉంటున్న ఆ గ్రామంలో 270 మంది నివసిస్తున్నారు. బీఆర్‌ఎస్ హాయాంలో గ్రామంలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయగా కేవలం మూడు ఇండ్లు మాత్రమే పూర్తి చేశారు. అప్పటి ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు మంజూరు చేసింది.

ఇంటి నిర్మాణ వ్యయం పెరుగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2.20 లక్షలు పెంచిన్పటికీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఇంతే కాకుండా గ్రామంలో తాగునీటి సమస్య ఆదివాసీలను వెంటడుతున్నది. కరెంట్ కష్టాలు సైతం తప్పడం లేదు. ఎన్నోసార్లు ఆధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదు. 

నిర్భంధం నుంచి స్వతంత్రం వైపు

ఉమ్మడి ఏపీలో కుమ్రంభీం గడ్డ జోడేఘాట్‌కు వర్ధంతిన వెళ్లకుండా నాయకులను, ప్రజాప్రతినిధులను, విద్యార్థి సంఘాల నాయకులను నిర్భంధించి, అరెస్టు చేసిన ఘటనలున్నాయి. నేడు స్వరాష్ట్రంలో ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. గత ప్రభుత్వం భీం గడ్డపై ఆయనకు గుర్తుగా మ్యూజియం, స్మృతివనం ఏర్పాటు చేసింది. భీం సమాధి వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీం వర్ధంతి కేవలం హట్టి గ్రామానికే పరిమితం అయ్యింది. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అధికారికంగా వేడుకలు నిర్వహించడం గమనార్హం. గతంలో ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ పోరాట యోధులకు గుర్తింపు కరువైందన్న విషయం తెలుస్తున్నది.

అయితే నేడు నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

రాళ్లు తేలిన రోడ్డుపైనే జోడేఘాట్ ప్రజల ప్రయాణం

గత ప్రభుత్వం రూ.6 కోట్లతో హట్టి గ్రామం నుంచి జోడేఘాట్ వరకు బీటీ రోడ్డును మంజూరు చేసింది. హట్టి నుంచి టోకెట్ మోవాడ్ వరకు రోడ్డు పనులను రిజర్వు ఫారెస్ట్ అనుమతులు లేవని అటవీశాఖ అధికారులు పనులను అడ్డుకున్నారు. టోకెన్ మెవాడ్ నుంచి జోడేఘట్ వరకు 15 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం చేసినా గిరిజనులు రాళ్లు తేలిన రోడ్డుపై ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు.

జోడేఘాట్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం రూ.25 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేసింది. సందర్శకులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. పర్యాటకులకు ప్రత్యేక గదులు, హోటల్ నిర్మాణం చేపడుతామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ నిర్మించలేదు. ప్రసుతం కనీసం మంచి నీరు దొరకన పరిస్థితి నెలకొంది. 

ప్రభుత్వాలు మారినా మా దుస్థితి మారుత లేదు

జల్, జంగిల్, జమీన్ కోసం పోరాటం చేసి అమరుడైన కుమ్రంభీం ఆశయాలు నేటికీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా ఆదివాసీ గిరిజనుల సమస్యలు మాత్రం తీరడం లేదు. జోడేఘాట్‌తోపాపటు ఆదివాసీ ప్రాంతాల్లో అనేక సమస్యలతో మా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.

మా హక్కులను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. ఏటా భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నప్పటీకీ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదు.                

పెందోర్ బాదిరావు, జోడేఘాట్