- నాపై ఈడీ రైడ్స్ జరిగే అవకాశం
- అధికారులు వస్తే సాదర స్వాగతం
- చాయ్ బిస్కట్లు సిద్ధంగా ఉన్నాయి
- కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 2: తనపై త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) రైడ్స్ జరుగబోతున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఈడీలోని కొందరు వ్యక్తులే తనకు ఈ సమాచారం ఇచ్చారని వెల్లడించారు. పార్లమెంటులో ఇటీవల తాను చేసిన ‘చక్రవ్యూహం’ ప్రసంగం కొందరికి నచ్చలేదని, అందువల్లనే తనపై ఈడీకి ఉసిగొల్పారని శుక్రవారం ఆరోపించారు. నిజంగానే ఈడీ అధికారులు సోదాల కోసం వస్తే సాదరంగా ఆహ్వానిస్తానని చెప్పారు. వారికోసం తన ఇంట్లో చాయ్ బిస్కట్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
రాహుల్‌పై దాడి జరుగొచ్చు: రౌత్
శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ శుక్రవారం బాంబు పేల్చారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై దాడి చేసేందుకు బయటి దేశంలో కుట్ర జరుగుతున్నదని సంచలన ప్రకటన చేశారు. బీజేపీని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘రాహుల్‌గాంధీ ఒక్కరే కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వంపై గొంతెత్తున్న ప్రతిపక్ష నేతలందరికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నది. అది కూడా విదేశీ గడ్డపై కుట్ర పురుడు పోసుకొంటున్నది. ఏమైనా జరుగొచ్చు. వీరందరిపై దాడులు జరిగే ప్రమాదం ఉన్నది. రాహుల్‌గాంధీపై దాడికి అధిక అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు.