calender_icon.png 17 October, 2024 | 7:09 AM

కుల గణనను స్వాగతిస్తున్నాం!

17-10-2024 02:50:37 AM

గత ప్రభుత్వ కుటుంబ సర్వే ఎక్కడ?

బీఆర్‌ఎస్ పథకాలను వ్యతిరేకించడం సరికాదు

 ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం అన్నా రు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

బుధవారం నాంపల్లిలో ని పా ర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార్ స్వామి టీజేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ కులగణన ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పచ్చజెండా ఊపిన ప్రాజెక్టులు, పథకాలను ఇప్పుడు విమర్శించడం, వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలి కాని, ప్రతిపక్ష పార్టీలు దుర్భాషలాడడం సరికాదన్నారు. మూసీ నది పునరుద్ధరణ అద్భుతమైన కార్యక్రమమన్నారు.

పట్టణీకరణ మీద అధ్యయనం చేసిన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, వాటిని ప్రభుత్వం ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్, పల్ల వినయ్ కుమార్, యూత్ రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాషా, గ్రేటర్ అధ్యక్షులు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.