calender_icon.png 12 January, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

02-01-2025 12:00:00 AM

సెన్సెక్స్ 368 పాయింట్లు అప్

ముంబై, జనవరి 1: కొత్త ఏడాదికి స్టాక్ మార్కెట్ శుభారంభాన్ని ఇచ్చింది. 2025వ సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన బుధవారం బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు లాభాలతో ముగిసాయి. రోజంతా స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన  బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 368 పాయింట్ల లాభంతో 78,507 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇంట్రాడేలో ఈ సూచి 617 పాయింట్లు జంప్‌చేసి 78,756 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 23,822 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 98 పాయింట్లు లాభపడి  23,743 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

ఎంపికచేసిన హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు ఆసక్తి కారణంగా ఈ క్యాలండర్ సంవత్సరాన్ని మార్కెట్లు సానుకూలంగా ప్రారంభించాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, ఆటో, పవర్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,741 స్టాక్స్ పెరగ్గా, 1,241 స్టాక్స్ తగ్గాయి.  పలు ఆసియా, యూరప్, యూఎస్ మార్కెట్లకు జనవరి 1న సెలవు. దీనితో దేశీయ మార్కెట్‌పై బుధవారం అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పడలేదు. 2024 ఏడాది మొత్తంమీద సెన్సెక్స్ 5,898 పాయింట్లు (8.16 శాతం), నిఫ్టీ 1,913 పాయింట్లు (8.80 శాతం) చొప్పున లాభపడ్డాయి. 

వెలుగులో ఆటోమొబైల్ షేర్లు 

ఆటోమొబైల్ కంపెనీలు డిసెంబర్ నెలలో అమ్మకాలు పెంచుకున్న వార్తలు వెలువడటంతో బుధవారంనాటి ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.  ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ప్యాక్‌లో ప్రధాన ఆటో షేర్లన్నీ పెరిగాయి. అన్నింటికంటే అధికంగా మారుతి సుజుకి షేరు 3.2 శాతం ర్యాలీ జరిపింది.

మహీంద్రా అండ్ మహీంద్రా,  టాటా మోటార్స్‌తో పాటు లార్సన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జొమాటో, హెచ్‌సీఎల్ టెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనీలీవర్, టెక్ మహీంద్రాలు నష్టాలతో ముగిసాయి. 

వివిధ రంగాల సూచీల్లో అధికంగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.22 శాతం పెరిగింది.  ఇండస్ట్రియల్ ఇండెక్స్ 1.17 శాతం, పవర్ ఇండెక్స్ 0.94 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.76 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.68 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.51 శాతం, హెల్త్‌కేర్ సూచి 0.42 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, రియల్టీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.03 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.

కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు 

కొత్త ఏడాది తొలిరోజున సైతం మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొన సాగాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1,782 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 చివరిరోజున రూ.4,645 కోట్లు విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోగా, వరుస నాలుగు ట్రేడింగ్ సెషన్లలో వీరి అమ్మకాల మొత్తం రూ.9,000 కోట్లకు చేరింది.