కేసు నమోదు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆరు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం విడుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఢిల్లీ సివిల్స్ లైన్స్‌లో సీఎం నివాసం ఎదుట ఆప్ కార్యకర్తలు టపాసులు పేల్చారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లోనూ కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
బాణాసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు గత సోమవారం ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించింది. ఈ నిషేధం 2025 జనవరి 1 వరకు అమల్లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో విక్రయాలు, డెలివరీలకు సైతం నిషేధం వర్తిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.