ఆకర్షణీయ హంగులతో పోలింగ్ కేంద్రాలు ముస్తాబు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): నేడు జరుగబోయే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం అధికారులు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారికి స్వాగతం పలికేలా వినూత్న ఏర్పాట్లు చేశారు. ఆదర్శ పోలింగ్ కేంద్రం, యువత నిర్వహించే పోలింగ్ కేంద్రం ఇలా వివిధ పేర్లతో బూత్‌ల వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల ముఖద్వారాల వద్ద పూలు, అరిటాకులు, బెలూన్స్ ఏర్పాటు చేశారు.
పలు కేందాల్లో ఓటర్ల కోసం రెడ్‌కార్పెట్లు పరిచారు. ఓటు వేశాక సెల్ఫీలు తీసుకునేందుకు ‘ఐ ఓటెడ్’ అనే పేరిట సెల్ఫీ పాయింట్లను, ఇతర ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 180 థీమెటిక్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రోస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఆదర్శ, 5 మహిళ, ఒకటి వికలాంగుల కోసం, మరొకటి యూత్ మేనేజ్‌డ్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.