calender_icon.png 20 September, 2024 | 3:07 PM

అధిక ధరలతో బతుకు బరువు

21-07-2024 12:00:00 AM

దేశంలో రోజురోజుకు నిత్యావసర ధరలతోపాటు కూరగాయల ధరలు కూడా అమాంతం పెరుగుతుండడంతో సామాన్య ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆదాయం మూరెడైతే ఖర్చు మాత్రం బారెడవుతుండటంతో బతుకు ఎలా సాగించాలన్న సందిగ్ధంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. అన్యాయంగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించినా ఆ దిశగా అధికారుల చర్యలు లేకపోవడంతో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇక, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుండడంతో పేదలు రేషన్ బియ్యం, పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార పంటల సాగు తగ్గుతుండడంతోపాటు వ్యాపారులు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేయడమే ధరల పెరుగుదలకు ప్రధానం కారణంగా తెలుస్తున్నది.

మొక్కుబడి చర్యలు చాలవు

ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ టమాట, పచ్చిమిర్చి ధరలే. సామాన్య ప్రజలు వాడే టమాట కిలోకు 80 నుండి 100 రూపాయల వరకు ధర పలుకుతున్నది. ఇక, మిర్చి అయితే కొనలేక వెనుదిరుగుతున్నారు. వంటనూనెలు, పాలు, పప్పులు రాకెట్ వేగంతో దూసుకుపోయే పరిస్థితి దేశంలో నెలకొన్నది. సామాన్య పేదప్రజలు పప్పు వాడకం మానేశారనే చెప్పాలి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పాలకులు కనీసం ఆలోచించక పోవడం శోచనీయం. మొక్కుబడి పర్యటనలు చేయడం ద్వారా అసలు సమస్యలకు పరిష్కారం లభించదు. ఇకనైనా ప్రభుత్వాలు ఈ విషయాన్ని గ్రహించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా ప్రయత్నాలు మమ్మరం చేయాలి.

దీనికితోడు అతివృష్టి, అనావృష్టితో రైతులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు లాభసాటిగా వ్యవసాయ రంగం మార్చేందుకు పాలకులు నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలి. తద్వారా దేశ జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల భద్రత కల్పించవచ్చు. అధిక ధరలకు కళ్లెం వెయ్యవచ్చు. అదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలి. అప్పుడు మాత్రమే తలసరి ఆదాయం పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

జీఎస్టీ నెలకు లక్ష యాభై కోట్ల రూపాయలు పై చిలుకు సమకూరినా, స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించినా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేయకుండా, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశం వాస్తవ అభివృద్ధి సాధించలేదని గ్రహించాలి. స్వాతంత్య్రానంతరం నిత్యావసర సరుకుల వ్యాపారంపై ప్రభుత్వ అజమాయిషీ ఉంది. ధరలు పెరిగిన సందర్భాల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలు నిర్ణయించడమే కాక సహకార సంఘాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు సరుకులు అందించాలి. వ్యాపారస్తుల సరుకుల నిల్వపై ఆధికారుల నియంత్రణ ఉండాలి. నిబంధనలకు మించి సరుకులు ఉంటే వ్యాపారస్తులు దానిని అనివార్యంగా మార్కెట్‌కు విడుదల చేయాలి. అప్పుడే నిత్యావసరాల ధరలు తగ్గ అవకాశం ఉంటుంది. లేకపోతే, అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి.

 లకావత్ చిరంజీవి, కేయూ, వరంగల్