calender_icon.png 3 January, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారం వాయిదా

04-07-2024 01:13:58 AM

  1. మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ నియామకం కూడా 
  2. కుదరని ఏకాభిప్రాయం.. మరోసారి భేటీ 
  3. జిల్లాలు, సామాజిక అంశాల సమతూకం
  4. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్‌తో రేవంత్ భేటీ 

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. కీలక నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, క్యాబినెట్‌లో చోటు కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారం, పది  రోజుల తర్వాత మరోసారి సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో బుధవారం జరిగిన ఈ కీలక భేటీలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు.

అధ్యక్షుడి ఎంపిక విషయంలో మరోసారి పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రక్రియ మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవిలో బీసీలకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానం ఒక అభిప్రాయానికి వచ్చినా.. ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచిచూసి చర్చించడం మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. 

పీసీసీ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ? 

పీసీసీ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎంపీలు బలరామ్‌నాయక్, సురేష్‌షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క కూడా పీసీసీ చీఫ్ పదవిని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాకటలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితోపాటు పార్టీ అధ్యక్షడిగా కొనసాగుతున్నారు.

తెలంగాణలో కూడా కర్ణాటక విధానాన్నే అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరుతునట్లుగా తెలుస్తోంది. దీంతో పీసీసీ చీఫ్ విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, అందుకే వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రాష్ట్ర మంత్రి మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి, 17 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరుగురికి క్యాబినెట్‌లో చోటు ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈ అరడజను మంత్రి పదవుల కోసం దాదాపు డజను మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.

దీంతో సామాజిక సమీకరణాలు, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా ఖాళీ బెర్తులను ఫైనల్ చేయాలని అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుత క్యాబినెట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి ఎవరికీ అవకాశం రాలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఈ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినప్పటికీ.. మిగతా జిల్లాల నుంచి కూడా క్యాబినెట్‌లో బెర్తు కోసం పోటీ ఎక్కువగా ఉన్నది. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకుగాను నలుగురి పేర్లు ప్రచారం జరిగినప్పటికీ చివరలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో క్యాబినెట్ అంశంపై కూలంకశకంగా చర్చించేందుకు సమయం లేకపోవడంతోనే మంత్రివర్గ విస్తరణను ఏఐసీసీ వాయిదా వేసినట్లు తెలిసింది.