19-09-2024 12:16:07 AM
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
రూ.30 లక్షల సొత్తు స్వాధీనం
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 18: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. పక్కా స్కెచ్‌తో రెక్కీ చేస్తారు. పోలీసులకు తమ ఆచూకీ దొరకొద్దని చుడీదార్స్ ధరిస్తారు. వెరైటీ విగ్స్ పెట్టుకుంటారు. ఇంటికి వచ్చి తాళాలు పగులగొడతారు. అందిన కాడికి దోచుకెళ్తారు. ఈ ముఠాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి వారి ఆటకట్టిం చారు. వారిని కటకటాలకు పంపించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ బుధవారంకేసు వివరాలు వెల్లడించారు. సుధాకర్, శాంసన్, శనిదేవ్, అమర్‌జీత్ సింగ్, సురేశ్ ముఠాగా ఏర్పడ్డారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు.
వీరిపై రాజేంద్రనగర్ పీఎస్‌లో రెండు కేసులు, రాయదుర్గం పీఎస్‌లో ఒకటి, బషీర్‌బాగ్‌లో ౨ కేసులు నమోదుయ్యాయి. నిందితుడుల్లో సుధాకర్ ప్రధాన సూత్రధారైన సుధాకర్ సుమారు 60కిపైగా చోరీలకు పాల్పడ్డాడు. సుధాకర్‌ను పోలీసులు పలుమార్లు జైలుకు పంపించి పీడీ యాక్టు ప్రయోగించినా అతడిలో మార్పు రాలేదు. నిందితుడు జైలు శిక్ష అనుభవించే సమయంలో శాంసన్, శనిదేవ్, అమర్‌జిత్ సింగ్, సురేశ్‌తో పరిచయ మైంది. అందరూ బయటకు వచ్చాక ఒక ముఠాగా ఏర్పడ్డారు. సుధా కర్ చోరీలకు పాల్పడేటప్పుడు తాను విగ్ ధరించడమే కాక, మిగతా వారితో వేర్వేరు రకాలైన విగ్‌లు ధరింపజేస్తాడు.
వీరి వస్త్రధారణ కూడా అసాధారణంగా ఉంటుంది. సుధాకర్ కొన్నిసార్లు పోలీసులు గుర్తించకుండా చుడీదార్స్ కూడా ధరిస్తుంటాడు. నిందితులు ఇంట్లో సొత్తుతో పాటు వాహనాలను కూడా అపహరించి, వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఈ క్రమంలో ముఠా ఇటీవల అత్తాపూర్ లక్ష్మీనగర్‌లోని ఓ ఇంట్లో చొరబడ్డారు. 60 తులాల బంగారం అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసులో ప్రధాన సూత్రధారి సుధాకర్‌పై మరోసారి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు.