సీబీఐపై తృణముల్ కాంగ్రెస్ ఆరోపణ
ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 : సందేశ్‌ఖాలీలో సీబీఐ అధికారులే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రహస్యంగా దాచి ఉంచారని పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీ ఆరోపించింది. ఆ తర్వాత వారే సోదాలు నిర్వహించి పట్టుకున్నట్లు చెబుతున్నారని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి సీబీఐపై ఫిర్యాదు చేసింది. సందేశ్‌ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో తమతో సహా ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోకుండా కుట్ర పన్నుతోందని ఆరోపించింది. టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్, అనుచరులు.. సందేశ్‌ఖాలీలో మహిళలపై అత్యాచారం జరిపారని, దోపిడీకి, భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో మరింత విచారణ జరపాలని కోల్‌కతా హైకోర్టు సీబీఐని ఆదేశించగా, సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు శుక్రవారం సందేశ్‌ఖాలీలో సోదాలు నిర్వహించి ఓ ఇంటి నుంచి భారీ సంఖ్యలో విదేశీ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిని బెంగాల్ ప్రభుత్వం ఈసీకి ఫిర్యాదు చేసింది.
శాంతిభద్రతలు రాష్ట్రం చూసుకుంటుంది..
శాంతిభద్రతలు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సందేశ్‌ఖాలీలో ఎలాంటి సమాచారం లేకుండా సీబీఐ ఉద్దేశపూర్వకంగా సోదాలు నిర్వహించిందని ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. సీబీఐ నేషనల్ సెక్యూరిటీ గార్డుకు చెందిన బాంబ్ స్కాడ్‌తో సహా అదనపు బలగాలను దించిందని, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బాంబ్ స్కాడ్ సీబీఐ ఆపరేషన్‌కు సహా యం చేయగలిగినప్పటికీ ఎలాంటి సహా యం కోరలేదు అని వివరించింది. సోదాల్లో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని.. అవి షాజహాన్ బంధువు ఇళ్లలోనే అని సీబీఐ మీడియాకు తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది.
భయాన్ని సృష్టించేలా..
సందేశ్‌ఖాలీలో ఆ ఆయుధాలను దర్యాప్తు సంస్థే రహస్యంగా అమర్చే అవకాశం లేకపోలేదని బెంగాల్ ప్రభుత్వం ఆరోపించింది. ఓటర్లలో భయాన్ని సృష్టించేందుకే ఇదంతా చేస్తోందని.. దర్యాప్తు సంస్థలు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా మార్గదర్శకాలను జారీ చేయాలని ఈసీని కోరింది.
ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే : సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో భారీ స్థాయిలో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి దొరికాయని సీబీఐ చెప్పినదానికి ఎలాంటి ఆధారాలు లేవని సీఎం మమతా బెనర్జీ అన్నారు. అవి ఎక్కడ పట్టుబడ్డాయనేది ఎవరికీ తెలియదని.. అధికారులే తమ కారులో తీసుకువచ్చి, పట్టుబడిన వాటిగా చూపించారేమో అని ఆరోపించారు. అంతా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పశ్చిమ బుర్ద్‌వాన్ జిల్లాలోని కుల్తీలో శనివారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఈ మేరకు ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో చాక్లెట్ బాంబ్ పేలినా సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ వంటి ఏజెన్సీలను పంపేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.