మార్కెట్‌ను ముంచిన యూఎస్ ఫెడ్
నాలుగో రోజూ కొనసాగిన సూచీల పతనం
సెన్సెక్స్ మరో రూ.960 పాయింట్లు డౌన్
24,000 పాయింట్ల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ
ముంబై, డిసెంబర్ 19: అమెరికా కేంద్ర బ్యాంక్ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై ప్రతికూల సంకేతాల్ని వెల్లడించడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఈ క్రమంలో భారత స్టాక్ సూచీలు గురువారం వరుసగా నాలుగో రోజూ పతనాన్ని చవిచూశాయి. భారీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 964 పాయిం ట్లు కోల్పోయి, 80,000 పాయింట్ల స్థాయి దిగువన 79,218 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 24,000 పాయింట్ల దిగువన 23,951 పాయింట్ల వద్ద నిలిచింది. వరుస నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,915 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ 4 రోజుల్లో రూ.9.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. ఇదేకాలంలో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.9,65,935 కోట్లు తగ్గి రూ.4,49,76, 402 కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) చేరింది. యూఎస్ ఫెడ్ ఇన్వెస్టర్లను నిరాశపర్చడంతో గ్లోబల్ ట్రెండ్‌లో భాగంగా స్థానిక మార్కెట్‌లో అమ్మకాలు జరిగాయని ట్రేడర్లు తెలిపారు.
ఈ ప్రభావంతో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు తగ్గాయి. యూరప్‌లోనూ ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు నెగిటివ్‌గా ముగిసాయి. రూపాయి మరో సరికొత్త కనిష్ఠస్థాయికి పడిపోవడం కూడా ఈక్విటీ మార్కెట్‌ను ఆందోళనపర్చిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. రూపాయి పతనంతో వాణిజ్యలోటు, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయన్నారు. గత రాత్రి అమెరికా డోజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 2 శాతం మేర పతనమయ్యాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్
సెన్సెక్స్ ప్యాక్‌లో. అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్ 2.5 శాతం క్షీణించి రూ.1,590 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ 1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు సన్‌ఫార్మా, హిందుస్థాన్ యూనీలీవర్, పవర్‌గ్రిడ్ స్వల్ప లాభంతో ముగిసాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 1.20 శాతం తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.15 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.07 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.05 శాతం చొప్పున క్షీణించాయి.హెల్త్‌కేర్ సూచీ మాత్రం లాభపడింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం చొప్పున తగ్గాయి.
ఫెడరల్ రిజర్వ్ షాక్
యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీ సమీక్షలో వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (4.25 శాతానికి) తగ్గించింది. అయితే వచ్చే ఏడాది రెండు దఫాలు మాత్రమే వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందన్న సంకేతాల్ని యూఎస్ ఫెడ్ కమిటీ వెల్లడిం చింది. 2025లో నాలుగు దఫాల రేట్ల కోత ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు ఫెడ్ గండికొట్టింది. అలాగే వచ్చే జనవరిలో మరో రేట్ల కోత ఉంటుందన్న అంచనాలకూ బ్రేక్‌పడింది.
ద్రవ్యో ల్బణం గరిష్ఠస్థాయిలోనే ఉన్నందున, ద్రవ్య పాలసీ కఠినంగానే కొనసాగుతుందన్న సంకేతాల్ని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వెల్లడించారు. దీనితో బుధవారం రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది. ఇందుకు అ నుగుణంగా గురువారం ఆసియా, యూరప్ మార్కెట్లు పడిపోయాయి. వడ్డీ రేట్లపై ఫెడ్ కఠిన వైఖరితో అంతర్జాతీయ మార్కెట్ల పతనంలో భాగంగా భారత్ ఈక్విటీలూ పడిపోయాయని, వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకిం గ్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
కొనసాగిన ఎఫ్‌పీఐల విక్రయాలు
మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు వరుసగా నాలుగో రోజూ కొనసాగా యి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 4,224 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేం జీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో వరుస నాలుగు రోజు ల్లో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి వెన క్కు తీసుకున్న పెట్టుబడులు రూ. 12,000 కోట్లను మించాయి.