calender_icon.png 23 December, 2024 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపద సదుపయోగం కావాలి

28-08-2024 12:00:00 AM

విత్తం దేహి గుణాన్వితేషు 

మతిమానాన్యత్ర దేహి క్వచిత్

ప్రాప్తం వారినిధేర్జలం ఘనముఖే 

మాధుర్య యుక్తం సదా

జీవాః స్థావర జంగమాంశ్చ 

సకలా సంజీవ్య భూమండలమ్

భూయం పశ్య తదేవ కోటి 

గుణితం గఛ్ఛంత మంభోనిధిమ్ ॥

- చాణక్య నీతి: -8---5

“మనం ఇతరులకు ఏది ఇస్తే అది మనకు మరో మార్గంలో ఎన్నో రెట్లుగా తిరిగివస్తుంది. ఉదా॥కు మేఘుడు సముద్రంలోని ఉప్పునీరు తాను తీసుకొని శుభ్రమైన తాగునీటిని వర్షం రూపంలో ప్రజలకు అందిస్తున్నాడు. దానితో భూమిపై వున్న సకల చరాచర జీవసంతతీ వర్ధిల్లుతున్నది. తిరిగి ఆ నీరే అనేక రెట్లుగా వృద్ధి పొంది సముద్రంలో కలుస్తున్నది. అలాగే, యోగ్యులైన వారి అవసరాలను గుర్తించి వాటిని తీర్చడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సంపద కూడా ప్రయోజనం పొందుతుంది. కష్టపడకుండా, అయాచితంగా, ఉచితంగా వచ్చే సంపదవల్ల సోమరితనం పెరిగి పోయి వ్యసనశీలురుగా మారే ప్రమాదం ఉన్నది. ధనం ఇవ్వవలసి వస్తే గుణవంతునికే దానంగా ఇవ్వాలి. గుణరహితునకు ఎప్పుడూ ఇవ్వకూడదు” అని అంటాడు చాణక్య. 

అడిగితే ఇచ్చేది భిక్ష. చేసిన పనికి ప్రతిఫలంగా ఇచ్చేది దక్షిణ. కాగా, ఇతరుల కష్టాలకు స్పందించి ఇచ్చేది దానం. దానమివ్వడం సమంజసమే కానీ, అపాత్రదానం చేయకూడదు. అర్హత ప్రాతిపదికగా ఇచ్చిన దానం సదుపయోగమవుతుంది. ‘న్యాయార్జేన మర్థస్య, వర్ధనం, పాలనం, సత్పాత్రే పతిపత్తశ్చ రాజవృత్తం చతుర్విధం’ అంటుంది కామందక నీతిసారం. న్యాయమార్గంలో, ధర్మబద్ధంగా సంపదను ఆర్జించడం, దానిని వృద్ధి చేయడం, రక్షించడం, అర్హత గలిగిన వారికి దానం చేయడం.. పాలకుల కర్తవ్యంగా ఆ నీతిసారం చెపుతుంది.

దానం, భోగం, నాశం ఈ మూడూ ధనానికి లక్షణాలుగా భారతం చెప్పింది. అర్హులతో సంపదను పంచుకోవాలి. లేదా తాను అనుభవించాలి. అంతేకాని, ఈ రెండూ చేయని వారి సంపద నాశనమవుతుంది. దానగ్రహీత తన అవసరాలకు మించి ఆశించవద్దు. అలాగే, తాను తీసుకున్న ప్రతి పైసా సద్వినియోగం చేయాలి. ఒకవేళ ఇచ్చేవాడు అభిజాత్యం కొద్దీ ఎక్కువగా ఇచ్చినా దానిని సమాజం కోసం వ్యయం చేయాలి.

సూర్యుడు వెలుగుతూ ఉన్నప్పుడు, చీకటి లోకం చూపును అడ్డుకోగలుగుతుందా? అంటే అడ్డుకోలేదు. అలాగే, ఇతరుల కష్టాలను చూసి స్పందించిన దాత, యాచన చేసిన వానిని నిరాశతో పంపడం సమంజసం కాదని భావిస్తాడు. అయితే, వారి అవసరాలను తెలుసుకొని దానికి తగిన ద్రవ్యాన్ని సమకూర్చడం వల్ల ధనం దుర్వినియోగం కాదు. ముఖ్యంగా సంపదను విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలపై వ్యయం చేస్తే అది సంపదను సృష్టిస్తుంది. పరిశ్రమించిన వారికి గౌరవాన్నీ ఇస్తుంది. దానం చేసిన వారికి సంతృప్తిని మిగిలిస్తుంది.

‘స్వయం తీర్ణః పరాంస్తారయతి’. దానాన్ని ఇవ్వడం వల్ల ఇచ్చినవాడూ, తీసుకున్నవాడూ ఆనందంగా ఉండాలి. అలా ఉండాలంటే యోగ్యతను గుర్తించి ఇచ్చేవాడు ఇవ్వాలి, అడిగేవాడు అవసరానికి మించి ఆశించకూడదు. యాచించిన ద్రవ్యాన్ని వ్యసనాలకు ఉపయోగించేవాడు అధమాధముడని భారతీయ సంస్కృతి నిర్ధారించింది.

‘రఘువంశం’లో కౌత్సుడు గురుదక్షిణ కింద తాను ఇవ్వవలసిన ద్రవ్యాన్ని రఘుమహారాజు వద్ద యాచిస్తాడు. అయితే, అప్పటికే రఘువు విశ్వజిత్తు యాగం చేసి తనకు ఉన్నదంతా దానం చేసేశాడు. ఈ కారణంగా ధనాధిపతియైన కుబేరునిపై దండెత్తే ప్రయత్నం చేస్తాడు. రఘువుకు భయపడిన కుబేరుడు రాత్రికి రాత్రే రఘువు కోశాగారాలను సువర్ణంతో నింపివేస్తాడు. ఉదయాన్నే రఘువు కౌత్సునితో ఆ మొత్తం సంపదనూ తీసుకు వెళ్ళమని చెబుతాడు.

కౌత్సుడు తనకు అవసరమైన దానికన్నా అదనంగా ఏమీ వద్దని తిరస్కరిస్తాడు. కనుక, దానం తీసుకునే వ్యక్తి తన అవసరాన్ని గుర్తించి అంతమాత్రమే ఆశించాలని ఈ సన్నివేశం మనకు బోధిస్తున్నది. ‘భాగవతం’లో వామనుడు కూడా తాను అడిగిన మూడు అడుగుల నేల తప్ప మరేదీ తనకు అవసరం లేదని చెప్తాడు. కాబట్టి, ప్రతి గ్రహీత ఎలా ఉండాలో చాణక్యుడు పై శ్లోకంలో తెలియచేశాడు.

 పాలకుర్తి రామమూర్తి