calender_icon.png 13 November, 2024 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ ఆవిష్కరణలతో సంపద సృష్టి

10-11-2024 02:09:54 AM

  1. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు స్వాగతం పలుకుతున్న అధికారులు

  2. సీప్లేన్ టూరిజంతో విప్లవాత్మక మార్పులు
  3. ఏపీ సీఎంనారా చంద్రబాబు నాయుడు
  4. విజయవాడ పున్నమి ఘాట్‌లో సీప్లేన్ ప్రారంభం
  5. శ్రీశైలం ప్రయాణించి మల్లన్నను దర్శించుకున్న ముఖ్యమంత్రి

నల్లగొండ, నవంబర్ 9 (విజయక్రాంతి): నవ ఆవిష్కరణలతోనే సంపద సృష్టి సాధ్యమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పున్నమి ఘాట్‌లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి శనివారం సీ ఆయన ప్రారంభించి మాట్లాడారు.  

రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలబెడతాం..

కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలబెడతామని సీఎం సీబీఎన్ చెప్పారు. విధ్వంసమైన వ్యవస్థలను బాగు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నదని, ప్రగతి పరుగులు పెట్టించేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. 

సీప్లేన్‌తో రవాణా..

రాష్ట్రంలో ప్రధాని మోడీ సీ ప్లేన్ అభివృద్ధికి  ముందుకొచ్చారని వెల్లడించారు. విమాన ఛార్జీలకు సరిసమానంగా సీప్లేన్ ఛార్జీలను తేగలిగితే ఈ రంగానికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సీప్లేన్‌తో టూరిజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు.ఏపీకి 973 కి.మీ మేర తీర ప్రాంతం ఉందన్నారు. రాబోయే రోజుల్లో సీ ప్లేన్ ద్వారా ఏపీలో ఎక్కడికక్కడ రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని సీఎం తెలిపారు. సీ ఫ్లేన్‌లకు ఎక్కడా విమానాశ్రయాలు అవసరం లేదన్నారు.

ఏడాది లో పది సీప్లేన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. మౌలిక వసతులపై ఖర్చు చేస్తే 2 నుంచి 2.5 శాతం వృద్ధి రేటుకు వీలుంటుందని, అదే పర్యాటకంపై ఖర్చు చేస్తే 6 రెట్లు ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండికోట ఒకటని, ఇది అమెరికాలోని గ్రాండ్ కెనియన్‌తో సమానమని  పేర్కొన్నారు. ఎన్టీఆర్ సాగునీటి ప్రాజెక్టును గండికోటలో నిర్మించిన కారణంగా ఇప్పుడు 25 టీఎంసీలు నింపుకోగలుగుతున్నామన్నారు. 

త్వరలో కొత్త టూరిజం పాలసీ..

రాష్ట్రంలో త్వరలో కొత్త టూరిజం పాలసీని తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడిం చారు. ఇప్పటికే పర్యాటకానికి పారిశ్రామిక గుర్తింపు ఇచ్చామని, పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు నిర్మించి ఆతిథ్యానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కోనసీమ, అరకులో ప్రకృతి సోయగాలను చూస్తూ కాఫీ తాగితే వచ్చే అనుభూతి పారిస్‌లోనూ రాదని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భవిష్యత్ బంగారమవుతుందన్నారు.

భవిష్యత్‌లో ఒక్క వాట్సాప్ సందేశం పెడితే అవసరమైన సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి రానుందని తెలిపారు. అనంతరం మంత్రులతో కలిసి ఆయన సీప్లేన్‌లో శ్రీశైలం వెళ్లారు. పాతాలగంగ వద్ద సీప్లేన్ దిగి రోప్ వే ద్వారా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారిని  మంత్రులతో కలిసి సీఎం దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.