కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పోలీసు, రెవెన్యూ, దేవస్థానం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్(Collector Jitesh V.Patil) అన్నారు. మంగళవారం నాడు భద్రాచలంలోని ముక్కోటి ఏర్పాట్లకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం, గోదావరి ఘాట్, గోదావరి ఘాట్ పక్కన ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్, విడిది గృహాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం చరిత్రను ఖండంతరాలకు వ్యాపింప చేయడానికి ఈనెల 9 10 తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.
స్వామివారి విశిష్టత చరిత్ర భక్తులకు చాలామందికి తెలిదని, స్వర్గ ద్వారాలు తెరుచుకొని వైకుంఠ ద్వారం ద్వారా మనకు దర్శనం ఇస్తున్నాడని, అందుకు భక్తులు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇటువంటి దర్శనం దొరకదని ఆయన అన్నారు. భక్తులు స్వామిని తనివి తీర దర్శనం చేసుకోవడానికి భక్తులకు, వీవీఐపీలకు, వీఐపీలకు వేరువేరుగా సెక్టార్లు ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని శాఖల అధికారులు వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని అన్నారు. ఈ సంవత్సరం భక్తులకు కనువిందు చేయడానికి ఈ జిల్లా యొక్క చరిత్ర తెలియజేయడానికి ఏరు(రివర్)ఫెస్టివల్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, ఈ ఫెస్టివల్ లో గిరిజన ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాకృతులు, వంటకాలు, సాంప్రదాయాలకు సంబంధించిన పాతకాలపు ఆభరణాలు, ఔషధ గుణాలకు సంబంధించిన ఆహార పదార్థాలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి గిరిజన కళలకు సంబంధించిన కళా ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని, 8 9 10 తేదీలలో ప్రత్యేకంగా గిరిజన విద్యార్థిని విద్యార్థులు, ఇతర పాఠశాలకు సంబంధించిన విద్యార్థులచే ప్రత్యేక కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని అన్నారు.
అలాగే పర్యాటక దర్శనీయ స్థలాలు గుర్తించి పర్యాటకులు విడిది చేయడానికి కరకట్ట పక్కన విడిది గృహాలు ఏర్పాటు చేశామని, పర్యాటకులు ఇక్కడ బస చేసి మరుసటి రోజు బొజ్జిగుప్ప, కిన్నెరసాని, బెండలపాడు, ఐటీడీఏ లోని గిరిజనులకు సంబంధించిన మ్యూజియం సందర్శించి వెళ్లడానికి ప్రత్యేక ప్యాకేజీ కింద అందరికీ సరసమైన ధరలు 6000 రూపాయలు నిర్ణయించి ఈ యొక్క గ్రామాలు పర్యాటకులు సందర్శించే విధంగా వెసులుబాటు కల్పించామని అన్నారు. విడిదీ కేంద్రంలో బస చేసే వారికి గిరిజన వంటకాలు మహిళా సమైక్యల ద్వారా ఏర్పాట్లు చేశామని, భక్తులు తప్పకుండా ఈ యొక్క ప్రదేశాలను సందర్శించి గిరిజన కల్చర్ కు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని తిరిగి మీ గ్రామాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ రావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఏఈ వెంకటేశ్వర్లు, తాహసీల్దార్ శ్రీనివాస్, ఏసిఎంఓ రమణయ్య, జేడీఎం హరికృష్ణ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.