05-04-2025 05:58:29 PM
టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పిక్చర్ టైం థియేటర్ లో ఔత్సాహిక కళాకారులతో నిర్వహించిన సమావేశంలో యువ దర్శకుడు దండనాయకుల మానస్ తో కలిసి మాట్లాడుతూ.. జిల్లాలో అనేక ప్రకృతి వనరులు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకుంటే సినిమా సీరియల్స్ షూటింగ్ కు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అయితే షూటింగ్ కోసం జిల్లాకు వచ్చే కళాకారులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందన్నారు. వాటి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.
30 సంవత్సరాల నుండి సినిమా రంగంలో ఉన్నానని ఇప్పటివరకు 27 సీరియల్స్ 927 డాక్యుమెంటరీలు నిర్మించినట్లు తెలిపారు. వివిధ రకాల సీరియల్స్ కు నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నానని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 110 మందిని బుల్లితెరకు పరిచయం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మందికి అవకాశాలు కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు, దీనితో ఉపాధి పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నారు. అయితే సినిమా అనేది వృత్తిగా స్వీకరించినప్పుడు ఉపాధి సాధ్యమవుతుందని తెలిపారు. షూటింగ్ కోసం జిల్లాకు వచ్చే కళాకారులకు మౌలిక వసతులు అవసరం ఉంటుందని దీనికోసం జిల్లాలో ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వెనుకబడిన జిల్లాలో స్టూడియో ఏర్పాటు చేయడం అంటే చాలా సవాళ్లతో కూడుకొని ఉంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో స్థలం కేటాయిస్తే స్టూడియో ఏర్పాటుకు తను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు, సినిమా ఇండస్ట్రీ చైర్మన్ దిల్ రాజు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమిళనాడులోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి పర్యాటక రంగ అభివృద్ధి ప్రధాన కారణమని, జిల్లాలో కూడా దానిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. జిల్లాకు చెందిన వాడిగా గర్వపడుతూనే తాను చేసిన అనేక సీరియళ్లు సినిమాల గురించి వివరించారు. యువ డైరెక్టర్ మానస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న కళాకారులను రానున్న రోజుల్లో మంచి స్థాయికి తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు పిక్చర్ టైం థియేటర్ లో సురేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వెండి నంది అవార్డులు పొందిన జిల్లాకు చెందిన పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్ర "వీరభీమ్" ప్రదర్శింపజేశారు. ఈ కార్యక్రమంలో నవజ్యోతి సాంస్కృతిక సారధి అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, సభ్యులు రాధాకృష్ణ చారి, జిల్లాలోని వివిధ మండలాల కళాకారులు పాల్గొన్నారు.