ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకుంటాం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మాజీ కేంద్రమంత్రి దివంగత సుష్మాస్వరాజ్, తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో సుష్మాస్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు.
బీజేపీలో సుష్మాస్వరాజ్ అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించి, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పార్లమెంటులో తన వాణి బలంగా వినిపించారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ర్ట సాధన కోసం నిర్వహించిన అనేక సభల్లో సుష్మాస్వరాజ్ ప్రసంగించి చైతన్యం నింపారని తెలిపారు.
సకలజనుల సమ్మె సమయంలో రాష్ర్టంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలపై పోలీసు నిర్బంధం పెట్టి అనేక రకాల వేధింపులకు గురిచేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు రాష్ర్ట సాధన కోసం నినదించి రబ్బరు బుల్లెట్లు, లాఠీ దెబ్బలను లెక్కచేయకుండా పోరాడారని అన్నారు.
సుష్మాస్వరాజ్ నాడు ఉద్యమకారులకు అండగా నిలబడ్డారని, ధైర్యం కల్పించారని తెలిపారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలిగా ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టే సమయంలో క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ ప్రజలకు బాసటగా నిలిచారని ప్రశంసించారు.
రాష్ర్ట ఏర్పాటు బిల్లు పాస్ కాకుండా కారం నీళ్లు చల్లినా, కత్తులతో లోక్‌సభలోకి వచ్చినా ఎదిరించి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 160 మంది పార్లమెంటు సభ్యులతో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించిన ఘనత సుష్మాస్వరాజ్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ అమరవీరులు, సుష్మాస్వరాజ్ ఆశయసాధనలో బీజేపీ కార్యకర్తలందరూ పునరంకితమై వారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ర్ట అభివృద్ధి కోసం పనిచేస్తామని పిలుపునిచ్చారు.