భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆదివాసి గిరిజనులు ఎక్కువ శాతం నివసిస్తున్న జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లి గిరిజనుల ఆచార వ్యవహారాలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు భద్రాచలంకు వచ్చే భక్తులకు తెలియజేసి వారి ద్వారా ప్రపంచ స్థాయిలో భద్రాచలం పేరు మారుమోగేలా కృషి చేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం నాడు భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాల పక్కన టూరిజం స్పాట్ గా నిర్మిస్తున్న రివర్ సైడ్ క్యాంపెనింగ్, గిరిజన కల్చర్ స్టాల్స్ ఏర్పాట్ల నిర్మాణం పనులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, చింతూరు ప్రాజెక్టు అధికారి అపూర్వతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెల 10, 11 తేదీలలో జరిగే సీతారామచంద్రస్వామి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ఈ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటక దర్శనీయ స్థలాలు తెలిసే విధంగా ముఖ్యంగా గోదావరి కరకట్ట ప్రదేశాలలో రివర్ ఫెస్టివల్ తరహాలో భక్తులకు కనువిందు కలిగేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వచ్చిన భక్తులు వసతి కొరకు అన్ని సౌకర్యాలతో ట్రైబల్ కు సంబంధించిన పాతకాలపు నివాసాలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన సాంప్రదాయమైన వివిధ రకాల నృత్యాలతో పాటు ఆదివాసి సాంప్రదాయక వంటకాలు, వెదురు క్రాఫ్ట్స్ కడాఖండాలు టూరిస్టులకు అందుబాటులో ఉండేలా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు సాయంత్రం పూట గిరిజన కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, టూరిస్టులు సరదాగా సేదతీరి ఫోటోలు దిగడానికి సెల్ఫీ పాయింట్ రివర్ క్యాంపైనింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని, నాయక్ పోడు, కోయ తెగ, వడ్డరి, కుమ్మరి, మేదరి, క్రాప్స్ వస్తువులతో పాటు గిరిజన వంటకాలు, తేనె, తాటి బెల్లం, రాగి జావా, జొన్న జావా వివిధ రకాల న్యూట్రిషన్ కి సంబంధించిన ఆహార పదార్థాలు గిరిజనులు అమ్ముకొని ఉపాధి పొందడానికి 40 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ స్టాల్స్ లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా ప్రతీది పేపర్ బ్యాగులు పేపర్ కప్పులు పేపర్ ప్యాకింగ్ ను మాత్రమే వాడాలని, వచ్చే నెల 8వ తారీఖు నుండి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రివర్ ఫెస్టివల్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మార్చి వరకు కొనసాగిస్తామని, మరల నవంబర్ నుండి ప్రారంభించి ఆరు నెలలపాటు జరిగేలా ప్రణాళికల రూపొందిస్తామని అన్నారు. బొజ్జుగుప్ప గ్రామంలోని పర్యాటక కేంద్రానికి పర్యాటకులు వెళ్లే విధంగా వచ్చేనెల 5వ తేదీ నుండి కరపత్రాలు, బుక్ లెట్స్ పంపిణీ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఇరిగేషన్, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్ రావు, మత్స్య శాఖ ఏడి ఇంతియాజ్ అహ్మద్, ఇరిగేషన్ ఈ ఈ రాంప్రసాద్, డి ఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వరరావు, ఏ సి ఎం ఓ రమణయ్య, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, ఐకెపి ఏపిఎం జగదీష్, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.