సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు సార్లు ఛాంపియన్లుగా నిలిచి, తమ లెగసీ కంటిన్యూ చేస్తూ 5వ టైటిల్ గెలుచుకునేందుకు సిద్ధమవుతున్న తెలుగు వారియర్స్ జట్టుపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ సీజన్‌కు సంబంధించి తెలుగు వారియర్స్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్, హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘సీసీఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లింప్స్‌లో చూస్తే ఓ చోట మరీ చిన్నపిల్లాడిలా కనిపించాను. సీసీఎల్ ఆడుతూ పెరిగాను.
విష్ణు, సచిన్ పాషన్‌తో ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. మేము నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలుస్తామనే నమ్మకం ఉంది. అన్నిటికంటే అందరికీ వినోదం పంచాలనే పాషన్‌తో వస్తున్నాం. 14, 15 ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’ అన్నారు. సీసీఎల్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. ‘సీసీఎల్ 11వ సీజన్‌కు చేరుకోవడం మాకు గర్వకారణం. ఈ టోర్నమెంట్ ప్రత్యేకమైనది. భారతదేశంలోని చలనచిత్ర పరిశ్రమల నుంచి నటీనటులను ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. జట్ల నైపుణ్యం, స్ఫూర్తి , దృఢ సంకల్పాన్ని చూసి మేము సంతోషిస్తున్నాం. తెలుగు వారియర్స్ ఎల్లప్పుడూ టోర్నమెంట్‌కు అదనపు ఉత్సాహాన్ని తెస్తోంది’ అన్నారు.
సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ నా చైల్డ్ వుడ్ డ్రీమ్. సీసీఎల్ ఫార్మెట్ నా డ్రీమ్‌ను తీర్చింది. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ క్రికెట్ మాకు చాలా ఎనర్జీ ఇస్తోంది. మాది చాలా క్రేజీ టీమ్. మూడు నెలలుగా చాలా ప్రాక్టీస్ చేశాం. ఈసారి తప్పకుండా కప్ కొడతాం’ అని చెప్పారు. సచిన్ జోషి మాట్లాడుతూ.. ‘ఇండియాలో అందరి డ్రీమ్ క్రికెట్. ఆ డ్రీమ్ మాకు సీసీఎల్ రూపంలో తీరింది. హీరో వెంకటేశ్ సపోర్ట్‌ను మర్చిపోలేం’ అన్నారు. అశ్విన్ మాట్లాడుతూ.. ‘మేమంతా చాలా పాషన్‌తో ఆడుతున్నాం. ఐదోసారి కప్ తీసుకొస్తామని మా టీం అందరి తరపున చెబుతున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు. ఈ సమావేశంలో ఇంకా రఘు, ఆది, సామ్రాట్, షోరబ్ అర్ఫాత్ పాల్గొన్నారు.
గేమ్ షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 8 బెంగళూరు : తెలుగు వారియర్స్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్.
ఫిబ్రవరి 14 హైదరాబాద్ (రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్): తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్‌పురి దబ్బాంగ్స్.
ఫిబ్రవరి 15 హైదరాబాద్ (రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్): తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్.
ఫిబ్రవరి 23 సూరత్: తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్.