* వెయ్యి గొంతులు లక్ష డప్పుల సన్నాహక సమావేశంలో మందకృష్ణ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 24 (విజయక్రాంతి): మాదిగ జాతిని గెలిపించడానికి 30 ఏళ్లుగా అన్ని ప్రయత్నాలు చేశాను. వర్గీకరణ చేస్తామని ముందుకొచ్చిన ప్రతి పార్టీకి మద్దతు తెలిపాం. జాతి కోసమే ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చాం. ఏ పార్టీతో అయినా.. యుద్ధం చేశాం. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాలలు నాటి కన్నా నేడు తమకున్న శక్తినంతా ప్రయోగిస్తున్నారు. ఇలాంటి ఆపత్కాలంలో వర్గీకరణపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
ఈ అంతిమ పోరాటంలో జాతిని గెలిపించాల్సిన బాధ్యత మాదిగ కళాకారులదే అంటూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో వర్గీకరణ వ్యతిరేకులకు డప్పులతోనే సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 3న జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహుజన యుద్ద నౌక ఏపూరి సోమన్న అధ్యక్షతన మాదిగ కవులు, కళాకారులు, రచయితల సన్నాహాక సమావేశం మంగళవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం కానీ.. అడ్డుకునే శక్తులు బలంగా ఉన్నాయని ఇటీవల మాదిగ మేధావుల సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని మందకృష్ణ మాదిగ గుర్తుచేశారు. ఈ అడ్డంకులను ఎదుర్కొని జాతిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇప్పటివరకూ ఎంఆర్‌పీఎస్ తీసుకున్న నిర్ణయాలన్నీ జాతి ప్రయోజనాల కోసమే కానీ.. వ్యక్తిగతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.
సమావేశంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అధ్యక్షత వహించగా, దండోరా కళామండలి జాతీయ అధ్యక్షులు ఎన్‌వై అశోక్, ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా వాగ్గేయకారులు దరువు ఎల్లన్న, గిద్దె రాంనర్సయ్య, నలిగంటి శరత్, గజ్జల అశోక్, పల్లె నర్సింహ, రామచం భరత్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్, ఎమ్మార్పీఎస్ రా్రష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, వల్లాల వాణి, పాటమ్మ రాంబాబు, అందె భాస్కర్, టీపీసీసీ సాంస్కృతిక విభాగం నేత చక్రాల రఘు, డప్పొల్ల రమేష్, డప్పు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత వాగ్గేయకారులు ఎర్ర ఉపాళి ‘నేనే’ పుస్తకాన్ని మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు.