calender_icon.png 3 March, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోబోలను వాడతాం

03-03-2025 01:21:57 AM

టన్నెల్‌లో కార్మికుల జాడ కనిపెడతాం!

  1. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన దురదృష్టకరం
  2. రెండు మూడు రోజుల్లో సమస్య కొలిక్కి
  3. రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన సందర్భం ఇది..
  4. విపత్తుల సమయంలోనూ మాపై విమర్శలా ?
  5. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపాటు

నాగర్‌కర్నూల్, మార్చి 2 (విజయక్రాంతి): అవసరమైతే రోబో లను వినియోగించి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కు కున్న కార్మికుల జాడ కనిపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లారు.

రెస్క్యూ బృందాలతో కలిసి కొంతదూరం సొరంగంలోకి నడిచి వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులను ఆరా తీశారు. సీఎం అనంతరం సహాయక బృందాలకు సలహాలు సూచనలిచ్చారు. తర్వాత నిర్వహించిన సీఎం మీడి యా సమావేశం నిర్వహించారు. సొరంగ ప్రమాదం దేశంలోనే పెద్ద ప్రమాదమని, ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.

బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై బురద జల్లే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. నల్లగొండకు జలాలు తరలించాలన్న లక్ష్యంతో ఉమ్మడి ప్రభుత్వంలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభమయ్యాయని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి పనులను నిర్లక్ష్యంగా వదిలేసిందని ఆరోపించారు. పనుల వద్ద కనీసం విద్యుత్ సౌకర్యమైన కల్పించలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్ఠాత్మకంగా పనులు ప్రారంభించామన్నారు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనాబాధిత కుటుంబాలపై సానుభూతి చూపించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సి ఉందన్నారు.

ప్రస్తుతం 12 రకాల రెస్క్యూ టీం బృందాలు కార్మికుల జాడ కోసం అన్వేషిస్తున్నాయని, సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో మరో రెండు, మూడు రోజులు పడుతుందని రెస్క్యూ అధికారులు చెప్తున్నారని వెల్లడించారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించినప్పుడు నాటి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అక్కడికి అనుమతించలేదని గుర్తుచేశారు.

దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో ప్రమాదాలు సంభించినప్పుడూ అదే పరిస్థితి ఉండేదన్నారు.  కానీ.. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నదని, ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు. పర్యటనలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, ఏఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్ ఉన్నారు.