జానీ మాస్టర్ కేసుపై స్పందించిన టీఎఫ్‌సీసీ
కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేయగా, ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా జానీ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. తమ్మారెడ్డి భరద్వాజ్, ఝాన్సీతోపాటు ప్యానెల్ సభ్యులు ఇందు లో పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. ‘బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తెచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి చాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై చట్టపరమైన విచారణ జరుగుతోంది. వేధింపులు ఎదుర్కొన్న సమయంలో ఆ అమ్మాయి మైనర్. ఆమెకు న్యాయ సహాయం అవసరం. ఇద్దరి తరఫున వాదనలు విన్నాం. 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక తయారుచేస్తాం.
మా పరిధిలో మేము విచారణ పూర్తి చేశాం. అమ్మాయిల వివరాలు బయటకు చెప్పకూడదనే ఈ లేడీ కొరియోగ్రాఫర్ విషయం గోప్యంగా ఉంచాం. ఈ కేసులో వేరే ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. లీగల్‌గా, మెడికల్‌గా, పోలీసు సహాయం తీసుకోవడానికి ఒకవేళ ఆ అమ్మాయికి తగిన ధైర్యం, బలం లేకపోతే కమిటీ హెల్ప్ చేయగలగాలి. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంది. కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపాం.
రెండు ఫేక్ కంప్లుంట్స్ కూడా వచ్చాయి” అని పేర్కొన్నారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. 2018లో ప్యానల్ నెలకొల్పాం. ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్‌గా ఉంటారని తెలియజేయడానికే ఈరోజు మీడియా ముందుకొచ్చాం’ అన్నారు. చిత్ర పరిశ్రమలో మై నర్లు పనిచేయడంపై నిర్మాత వివేక్ కూచిభొట్ల స్పందిస్తూ.. ‘దానిని ప్రత్యేక మార్గదర్శకాలున్నాయి’ అని తెలిపారు.
ఫిర్యాదుల విభాగం వివరాలివే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ వివరాలు ఇలా ఉన్నాయి.. గౌరవ కార్యదర్శి, కన్వీనర్: కేఎల్.దామోదర్ ప్రసాద్; చైర్‌పర్సన్: ఝాన్సీ; అంతర్గత సభ్యులు: తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది; బాహ్య సభ్యులు: రామలక్ష్మి మేడపాటి (సామాజిక కార్యకర్త, మీడియా నిపుణురాలు), కావ్య మండవ (న్యాయవాది, ‘పి.ఒ.ఎస్.హెచ్’ నిపుణురాలు). లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నవారు ఫిర్యాదు చేయాలని టీఎఫ్‌సీసీ ఓ ప్రకటనలో కోరింది.
హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ వద్ద ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కంప్లుంట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డి.రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌ేొ500096 చిరునామాకు పోస్ట్ ద్వారా అయినా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఫోన్ నంబర్: 98499 72280, మెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.in ద్వారా ఫిర్యాదులు ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.