calender_icon.png 14 March, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిపై కేంద్రం కుట్రలను తిప్పికొడతాం

14-03-2025 01:31:18 AM

  1. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
  2. సౌత్ రాష్ట్రాల్లో తమ ప్రాతినిథ్యం లేదనే బీజేపీ ప్రభుత్వ ప్రతీకార చర్యలు
  3. 22న చెన్నైలో జరుగనున్న సమావేశానికి హాజరవుతున్నా..
  4. తెలంగాణలోనూ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం..
  5. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
  6. ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిసిన డీఎంకే బృందం

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజనతో కేంద్ర ప్రభు త్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తున్నదని, ఆ కుట్రలను తిప్పికొట్టే ఉద్యమంలో తానూ భాగస్వామినవుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల డిలిమిటే షన్ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైలో జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన సంగతి విదితమే.

త్వరలో ఏర్పాటు చేయనున్న ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)లో భాగస్వామి కావాలని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ ముఖ్య మంత్రులను లేఖలో స్టాలిన్ కోరారు. దీనిలో భాగంగానే తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ నేతృత్వంలో డీఎంకే ప్రతినిధుల బృందం బుధవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సదస్సుకు ఆహ్వానించింది.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్య తను కుదించే కుట్ర అని ఆరోపించారు 2026- జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు అనుగుణం గా నడచుకోవడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధిలో దక్షిణాది  రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, తమ ప్రాధాన్యతను తగ్గించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. దక్షిణాదిలో తమ పార్టీ పెద్దగా ప్రాతినిథ్యం లేదనే అక్కసుతోనే బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీసుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొనేందుకు ఏఐసీసీ అధిష్ఠానం ఇప్పటికే సూత్రప్రా యంగా అంగీకరించిందని స్పష్టం చేసిందన్నారు. అధిష్టానం అనుమతి తీసుకుని తాను చెన్నైలో జరుగనున్న సమావేశానికి హాజరవుతానని తేల్చి చెప్పారు.  నియోజకవర్గాల పునర్విభజ నపై తెలంగాణలోనూ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ మేరకు అన్ని పార్టీల నేతలను సమావేశానికి ఆహ్వానిస్తామని వెల్లడించారు.

ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సైతం ఆహ్వానిస్తామని, ఆయన సమావేశానికి హాజరై అఖిల పక్ష నేతల అభిప్రాయాలను కేంద్రానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాల్సిన తరుణం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సీఎంను కలిసిన వారిలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, ఆ పార్టీ ఎంపీలు ఏ రాజా, ఎన్‌ఆర్ ఇళంగో, కళానిధి వీరస్వామి, అరుణ్ నెహ్రూ తదితరులున్నారు.