calender_icon.png 23 January, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీల్చి చెండాడుతాం

23-01-2025 01:31:44 AM

  1. పేదల భూముల జోలికి రావొద్దు 
  2. ఎన్ని కేసులుపెట్టినా భయపడేది లేదు 
  3. బీజేపీ ఎంపీ ఈటల

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): సొంత భూముల్లో ఇండ్లు కట్టుకుంటున్న పేదల జోలికి వచ్చే గూండాలను, భూ అక్రమార్కులను చీల్చి చెండాడుతామ ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో రియల్ ఎస్టేట్‌కు చెందిన ఓ వ్యక్తిపై దాడి చేయాల్సిన సందర్భాన్ని ఆయన బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాకు వివరించారు. హైదరాబాద్‌లో పేదల భూములు, ఇంటి స్థలాలపై తాను పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గతంలో బాలాజీనగర్, జవహర్‌నగర్‌లలో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే, కాపాడుకునేలా బీజేపీ పోరాటం చేసిందని.. ఇప్పుడు అక్కడే హైడ్రా పేరుతో ఇండ్లను నేలమట్టం చేస్తుంటే బీజేపీ పక్షాన బాధితులకు అండగా నిలిచినట్లు తెలిపారు. 

నగరంలో గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు భూముల ఆక్రమణలతో దౌర్జన్యం చేశారని.. దీనిపై రాచకొండ సీపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కా రం చూపలేదన్నారు. పోలీసులు ఒత్తిళ్లతో పేదలకు న్యాయం చేయకపోయినా తాము అండగా నిలిచామన్నారు. ఏకశిలానగర్‌లో పేదలకు చెందిన పాట్లను ముగ్గురు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లతో వ్యవసాయ భూములుగా చూపేందుకు అధికారులను ప్రలోభపెట్టారని అన్నారు.

దీనిపై కోర్టు అక్రమార్కులకు వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్న పేదలను కొందరు అక్రమార్కులు బెదిరిస్తున్నారని, తాము క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు కూడా బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే, చూసి తట్టుకోలేకే ఆ వ్యక్తిపై చేయిచేసున్నట్టు వివరించారు.

జైలుపాలైన కలెక్టర్..

శంకర్‌పల్లిలో వందల కోట్ల విలువైన 460 ఎకరాల పరిధిలోని ప్లాట్లను ధరణి వచ్చిన తర్వాత వ్యవసాయ భూమిగా మార్చివేసి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఈటల ఆరోపించారు. ఆ తప్పులకు ఓ కలెక్టర్ జైలుపాలయ్యారని అన్నారు.

భూఅక్రమాల వెనక దుర్మార్గులు ఎవరో? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కుడుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలకు ఉందన్నారు. వట్టినాగులపల్లిలో వెయ్యి ఎకరాలు, షాద్‌నగర్ పరిధిలోని ఈదులపల్లి, ఈర్లపల్లి, నాదర్‌గుల్, బాలానగర్, గగన్‌పహాడ్ సహా అనేక ప్రాంతాల్లో భూ అక్రమాలు జరిగాయని ఈటల ఆరోపించారు.  

కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణం...

కాళేశ్వరం మీద పెట్టిన డబ్బుల కంటే వందల రెట్లు సంపద హైదరాబాద్‌లో భూ ఆక్రమణల ద్వారా నడుస్తోందని ఈటల ఆరోపించారు. ఇప్పటికైనా పాత జీపీ లే-అవుట్లకు సంబంధించి నోటీసులిచ్చి అగ్రికల్చర్ ల్యాండ్లను రద్దు చేసి మళ్లీ ప్లాట్లన్నింటినీ రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు.

ధరణి వచ్చిన తర్వాత భూముల రెగ్యూలరైజేషన్ ప్రక్రియలో లొసుగులతో పేదల భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. బాధితుల పక్షాన నిలిచిన తనపై కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారని, అందుకు భయపడేది లేదన్నారు.