calender_icon.png 4 October, 2024 | 10:34 AM

మీ భరతం పడతాం

04-10-2024 02:26:22 AM

అఖిలపక్షం ఏర్పాటుకు సిద్ధం

  1. మీ ఫాం హౌస్‌లను కాపాడుకోవడానికి.. మూసీ ముసుగు తొడుక్కోవాల్సి వచ్చిందా 
  2. మూసీ నిర్వాసితులకు.. డబుల్ బెడ్ రూం కంటే ప్రత్యామ్నాయం ఉందా? 
  3. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయిండ్రు
  4. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి 

* హైదరాబాద్ నగరంలో కిరాయి మూకలతో మూసీ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చూస్తే మీ భరతం పడతాం. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు? వరుసగా నాలుగు రోజులు కూర్చుందాం రండి. మీకు దమ్ముంటే అఖిల పక్ష సమావేశానికి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వండి. 

 సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఇంక నెలరోజులైనా మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందేనని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్ల చెరువులో, సున్నం చెరువులో ప్లాట్లు వేసి అమ్మినోళ్లు బీఆర్‌ఎస్ పార్టీ సన్నాసులు కాదా అని విమర్శించారు.

మూసీ నిర్వాసితులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఒక క్లిక్‌తో పొందేలా వన్ స్టేట్  వన్ కార్డు విధానాన్ని తీసుకొస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్డు ద్వారా బహుళ ప్రయోజనాలు పొందవచ్చాన్నరు.

సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యు లు అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రాంరంభించారు. 

హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో బలిసినోళ్లు ఫాం హౌస్‌లు కట్టుకుంటే.. వాళ్ల డ్రైనేజీ జంట జలాశయాల్లో కలిస్తే ఆ డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ ప్రజలు తాగాల్నట అని ఈ నా కొడుకులు చెపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

జన్వాడా, అజీజ్‌నగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావులకు ఉన్న ఫాం హౌస్‌లు అక్రమమా.. కాదా..? వాటిని కూలగొట్టాలా వద్దా.. అని అన్నారు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర మూడు ఫాం హౌస్‌లు కట్టినవ్ కదా.. నీ వెనుకాల కేవీపీ రాంచందర్ రావుకు ఉన్న ఫాం హౌస్ కూల గొట్టాలా.. వద్దా చెప్పు. మీ ఫాం హౌస్‌లపై ఎక్కడ వేటు పడతదోనని పేదలను అడ్డం పెట్టుకుని మీరు నాటకాలు ఆడుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 

చేతనైతే అఖిల పక్ష సమావేశానికి రండి

వరదలతో బురదలో కూరుకుపోతున్న హైదరాబాద్‌ను కాపాడాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే.. బావ బురద చల్లుతున్నారని అన్నారు. అధికారంలోకి రావడానికంటే ముందు మీకు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవన్నారు. మీ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 1500 కోట్లలో రూ. 500 కోట్లు మూసీలో మునిగిపోయినోళ్లకు పంచి పెట్టండి అని హితవు పలికారు.

వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాల్నో చెప్పాలనీ.. మా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీలో హైడ్రా గురించి చర్చ జరిగితే ఈ సన్నాసులు మాట్లాడకుండా పారిపోయారన్నారు. మూసీలో దోమలు, కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి, పని కల్పించి, పిల్లల చదువుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే కేటీఆర్, హరీశ్‌రావులకు వచ్చిన నొప్పి ఏందయ్యా..?

ఈటల రాజేందర్‌కు వచ్చిన దుఃఖం ఏందయ్యా.. అని అన్నారు. వాళ్లెప్పటికీ పేదోళ్లుగానే ఉంటే మీరు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాల్నా అంటూ మండిపడ్డారు. వాళ్లు మంచిగా బతికి.. మీ దొర తనాన్ని ప్రశ్నిస్తారనే ఉద్దేశ్యంతోనే మూసీ ప్రాజెక్ట్‌కు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు.

మూసీ మురికిలో జీవచ్ఛవాలుగా బతుకుతున్న పేదలకు ఆత్మగౌరవంతో బతకడానికి ఇళ్లు, ఇంటి ఖర్చులకు రూ. 25 వేలు ఇస్తున్నామన్నారు. అఖిలపక్ష సమావేశానికి పిలుస్తా.. చేతనైతే వచ్చి సలహాలు ఇవ్వాలన్నారు. మీ ఫాం హౌస్‌లను కాపాడుకోవడానికే ఇవాళ మూసీ ముసుగు తొడుక్కొన్నారన్నారు. 

మీ భరతం పడతా..

మూసీలో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేయడం లేదా.. వాటికి పరిష్కారం ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మనపై లేదా అని హితవు పలికారు. మీ ఇండ్లు కూలగొట్టొకుండా ఉండడానికి మూసీ ముసుగు తొడుక్కోవాల్సి వచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతర్రా మీరు.

ఇంకెంత కాలం వారం, 10 రోజులు, నెల రోజులు... అయినా వదలం. మీ భరతం పడతాం అనుకుంటుండ్రో.. ఒక్కొక్కణ్ని చింతపండు చేస్తా’ అంటూ హెచ్చరించారు. జవహర్‌నగర్‌లో ఉన్న 1000 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదోల్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దం రండి.. సన్నాసిసుల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

హరీశ్‌రావు, కేటీఆర్‌లు సచివాలయానికి వస్తే 4 రోజులయినా సరే లేవకుండా కూర్చొందాం రండి. చర్చలు చేద్దాం. చెరువులు, నాలాలు  ఆక్రమించుకున్నోళ్లు ఎవరో..? తేలుద్దాం అని అన్నారు. ఎవరో ఒకరు నడుం బిగించాలనీ.. నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుం దని అన్నారు. మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందేనని, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ని ఆక్రమణలను కూడా తీసేయాల్సిందే అన్నారు. 

ఈ ప్రాజెక్టు ఆపితే సంచులు వస్తాయ్..

గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు జేసినా.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. కానీ, చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు తొలగించాల్సిందేనన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆపితే శ్రీమంతుల నుంచి సంచులు వస్తాయ్ అని అన్నారు. కానీ, రాబోయే తరాల కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 

నల్లగొండలో మూసీ నీళ్లు తాగి పశువులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండను ప్రక్షాళన చేద్దామని మూసీ ప్రాజెక్ట్ మొదలు పెట్టినట్టు తెలిపారు. ఈటల రాజేందర్ నువ్వే లీడ్ తీసుకో.. మనం ఇద్దరం కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు పోదాం. కేంద్రం నుంచి రూ. 25 వేల కోట్లు తెద్దాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రజలకు రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు

రాష్ట్రంలో పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు తిరిగి వేసారిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాలనలో మెరుగైన విధానం ఉండాలని రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటకలో జరుగుతున్న విధానాలను, మన రాష్ట్రంలో జరుగుతున్న గత విధానాలను అంచనా వేసి ఒక నూత న విధానాన్ని ఒక స్టేట్  ఒక కార్డు అని తీసుకొస్తున్నామని అన్నారు.

పైలట్ ప్రాజెక్టు కింద నేటి నుంచి 7వ తేదీ వరకూ 119 నియోజక వర్గాల లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఏమైనా పొరపాట్లు, ఇబ్బందులను గుర్తిస్తే సరిచేస్తామన్నారు. రేషన్ కార్డు, పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల విద్యుత్, రూ. 500 గ్యాస్ సబ్సీడీ తదితర సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా పొందవచ్చు.

ప్రభుత్వంలోని 30 శాఖల సమాచారం ఈ కార్డుతో ఒక క్లిక్ ద్వారా తెలుసు కోవచ్చన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆధార్ కార్డును మెరుగుపర్చి ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో తీసుకొచ్చామన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ విధానంలో భాగంగా వన్ స్టేట్ బౌ వన్ కార్డు తీసుకొచ్చినట్టు సీఎం చెప్పారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇందులో తీసుకొచ్చి మీ కుటుంబా లకు రక్షణ కవచంలా ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు.

మీ ఇంటికి కొత్త కోడలు వచ్చినా.. మీ అమ్మాయి కి పెళ్లు అత్తవారింటికి వెళ్లినా ఈ కార్డు సంపూర్ణంగా ఉపయోగపడుతుందన్నారు. కంటోన్మోంట్ ప్రాంత ప్రజలను మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చాన్నారు. ఆర్మీకి భూమికి భూమి ఇచ్చి ఇక్కడి పేదలకు పట్టాలు ఇస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే 194 ఎకరాల భూమిని బదలాయించి నట్టు సీఎం చెప్పారు.