calender_icon.png 25 April, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం

25-04-2025 12:18:21 AM

బాధితులకు అండగా ఉంటాం  హైడ్రా కమిషనర్ రంగనాథ్

ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పర్యటన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(విజయక్రాంతి)  : ప్రభుత్వ, ప్రైవేటు భూము లు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. పటాన్‌చెరు ప్రాంతంలో ప్రణీత్‌కౌంటీకి సమీపంలోని నక్కవాగు నాలా కబ్జాను పరిశీలించారు. బఫర్‌జోన్‌తో కలిపి నాలా వెడల్పు 36మీటర్లు ఉండాల్సి ఉండగా, సగం వరకు కబ్జా చేసినట్లు గుర్తించారు. నిర్మాణ, అనుమతి మంజూరు పత్రాలను సమర్పించాలని వారికి చెప్పారు. నిబందనల మేరకు నాలా వెడల్పు లేని పక్షంలో ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మసీదు బండ, అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో భూముల కబ్జాపై వచ్చిన ఫిర్యా దులను పరిశీలించారు. హైడ్రా పేరిట అవకతవకలకు పాల్పడితే తన దృష్టికి తీసుకు రావాలని స్థానికులకు సూచించారు. 

అనంతరం గచ్చిబౌలిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లేఔట్‌ను పరిశీలించారు. లేఔట్ రహదారులు, పార్కులను హద్దులను చెరిపి వ్యాపారాత్మకంగా నడుపుతున్నట్లు గుర్తించారు. నెక్నంపూర్‌లో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మించిన ఫిర్యాదును పరిశీలించారు. గండిపేట నెక్నంపూర్ సర్వే నంబర్ 20లో ప్రభుత్వ భూమి కబ్జాను పరిశీలించిన అనంతరం, గండిపేట చెరువును సం దర్శించారు. ఖానాపూర్, నాగుల పల్లి నుం చి వచ్చే వరద నీరు ఆ చెరువులో కలుస్తోందని వచ్చిన ఫిర్యాదును పరిశీలించారు. ఎగువ ప్రాంతంలో  ఉన్న నివాసాలు, వాణిజ్యసముదాయాలు, రిసార్టుల నుంచి మురు గు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు కలువకుండా డైవర్ట్ చేయాలని సూచించారు.