calender_icon.png 23 October, 2024 | 4:57 AM

ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును అధిగమిస్తాం

04-08-2024 03:32:11 AM

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మం త్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అమెరికా పర్యటన వెళ్లనున్న సందర్భంగా శనివారం సచివా లయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత మార్చి 31 వరకు ఐటీ ఎగుమతులు రూ.2.7 లక్షల కోట్లుగా ఉండగా జూన్ చివరి నాటికి అది రూ.2.9 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. 11.28 శాతం వృద్ధిని నమోదు చేశామని తెలిపారు.

ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులతో బెంగళూరు మొదటి స్థానం లో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని వివరించారు. మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. వృద్ధిరేటును 11.28 శాతం నుంచి 25 శాతానికి తీసుకెళ్లే రోడ్‌మ్యాప్ సిద్ధమైందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఆవిర్భావంతో ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక పెద్ద ఏఐ హబ్‌గా రూపొందుతుందని అన్నారు. కృత్రిమ మేధ వల్ల లక్షలాది మంది కోడింగ్ ఇంజినీర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించే మొట్టమొదటిగా ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2 లక్షల మంది ఇంజినీర్లను ఏఐలో నిపుణులుగా తయారుచేస్తామని వెల్లడించారు.

తాము ప్రారంభించబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను డిజిటిల్ క్లాసుల ద్వారా నూతన అవకా శాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టి కలిగిన నాయకుడని, ప్రస్తుత అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులను తెచ్చేలా ఇండస్ట్రీ దిగ్గజాలతో ఆయన సంప్రదింపుల్లో ఉన్నారని వెల్లడించారు. ఏఐ రంగంలో యావత్తు ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించినట్టు శ్రీధర్‌బాబు చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ) కన్సార్టియం హైదరాబాద్‌లో మొదటి ఏడాది 2 వేల మందికి శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులను చేస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఫిన్‌టెక్ రంగంలో 20 వేల ఖాళీలు ఉన్నా నిపుణులైన మానవ వనరులు లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బీకాం, బీబీఎం లాంటి కోర్సులు చదివిన విద్యార్థులను సెకండియర్, థర్డ్‌ఇయర్‌లో ఎంపిక చేసి శిక్షణ ద్వారా జాబ్‌కు రెడీ చేస్తామని వివరించారు. దేశంలో మనమే ముందు కార్యాచరణ ప్రారంభించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.