26-04-2025 01:20:56 AM
జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ
అనంతనాగ్, ఏప్రిల్ 25: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి బాధితులను పరామర్శించారు. ‘ఇదొక భయానకమైన, విషాదకర ఘటన. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చా. ఈ దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నా ప్రేమ ఆప్యాయతలు ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటాయి.
దేశం మొత్తం మీతో ఉంది.’ అని అన్నారు. అనంతరం రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. ‘ఉగ్రవాదం అణచివేసేందుకు ఎటువంటి చర్య తీసుకున్నా కాంగ్రెస్, నేను పూర్తి మద్దతునిస్తాం’ అని పేర్కొన్నారు.
‘సమాజాన్ని విభజించడం కోసమే ఈ దాడి చేశారు. ఈ సమయంలో భారతీయులు ఐక్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడే ఉగ్రచర్యలను, వారి ప్రయత్నాలను దీటుగా ఎదుర్కోగలం. కశ్మీర్ వాసులనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులపై కూడా దాడులు చేయడం హేయనీయం’ అని స్పష్టం చేశారు.
సీఎం, ఎల్‌జీని కలిసిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. ‘ఎలా జరిగిందో వారిద్దరూ మొత్తం వివరించారు. మా పార్టీ తరఫున కేంద్రప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతిస్తాం’ అని వారికి హామీనిచ్చారు.