calender_icon.png 21 September, 2024 | 8:40 AM

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం

07-09-2024 12:46:03 AM

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ 

హనుమకొండ, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని, బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సానికి ధ్వంసమైన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం నార్లాపూర్‌లోని పిడుగుపాటుకు మృతి చెందిన పుట్ట మహేష్, కాల్వపల్లి చెరువులో పడి మృతి చెందిన జేరుపోతుల ఉప్పలయ్య కుటుంబాలను పరామర్శించారు.

అక్కడి నుంచి గుండ్లవాగు వద్ద దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు. గుండ్లవాగను చూస్తే కన్నీరే వస్తోందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు రాకపోవడం, సర్వే చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం నష్టపరిహారంగా ఇస్తామన్న రూ.10 వేలు కాకుండా పంట భూములను సాగులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఆమెరికాలో టోర్నడోలు వచ్చినట్లు మేడారం అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించి లక్ష చెట్లకు పైగా ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఆయనవెంట బీజేపీ సీనియర్ నాయకులు గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నారు.