19-03-2025 02:28:57 PM
అందరికి అందుబాటులో ఉండేలా సాండ్ బజార్
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్
రాజేంద్రనగర్: తెలంగాణ మైన్స్, జియాలజీ సహకారంతో తెలంగాణ మినరల్ డెవలప్ కార్పోరేషన్(Telangana Mineral Development Corporation) ఆధ్వర్యంలో వట్టినాగులపల్లిలోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా సాండ్ బజార్ ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సాండ్ బజార్ ను తెలంగాణ మినరల్ డెవలప్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, తెలంగాణ మైన్స్ జియాలజీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజి శశాంక్ తదితరులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక దగ్గర సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఇప్పటివరకు మూడు ప్రాంతాల్లో సాండ్ బజార్ ఏర్పాటు చేశా మన్నారు. అతి త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధిలో అన్ని ప్రాంతాలలో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామనని వివరించారు. తెలంగాణ మినరల్ డెవలప్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాండ్ బజార్ లో దొడ్డు ఇసుక మెట్రిక్ టన్నుకు 1600, సన్న ఇసుక మెట్రిక్ టన్నుకు 1800 రూపాయలకు 365 రోజులు వినియోగదారులకు ఇదే ధరలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 24/7 వినియోగదారులకు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని రవాణా చార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నర్సింగ్ కి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ గౌడ్, టిపిసిసి అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.