- రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
- సంగారెడ్డి సెంట్రల్ జైల్లో బాధితుల స్టేట్‌మెంట్ రికార్డ్
సంగారెడ్డి/వికారాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): లగచర్ల ఘటనను సీఎం దృష్టి కి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగచర్ల నిందితులతో మాట్లాడి వారి నుంచి ఘటనా వివరాలు సేకరించారు.
జైల్లో ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. లగచర్లలో ఘటన జరిగి పది రోజులైనా గ్రామంలోని ప్రజలింకా తేరుకోలేదన్నారు. ప్రజలకు రక్షణ కలిపించేందుకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ కృషి చేస్తోంద న్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటన దురదృష్టకరమన్నారు. లగచర్లలో ఘటనలో పోలీసులు కఠినంగా వ్యవహరించారని తెలిపారు. సంగారెడ్డి జైల్లో ఉన్న 24 మంది నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
గిరిజనులకు అన్యాయం...
ఫార్మా పేరుతో చేపడుతున్న భూసేకరణతో లంబాడ, గిరిజన సోదరులకు అన్యా యం జరుగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని లగచర్ల, రోటిబండ తండాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఫార్మా భూ బాధితులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడు తూ లగచర్ల ఘటన తర్వాత చోట చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల భూములు తీసుకోవడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.