22-03-2025 08:45:59 PM
దంతేవాడ పరిధిలో గల కొండపార గ్రామంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం..
చర్ల (విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 231వ బెటాలియన్ దంతేవాడ పరిధిలో గల కొండపార గ్రామంలో శనివారం సివిక్ యాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు ఈ సందర్భంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు, గ్రామస్తులకు చీరలు, లుంగీలు, కంచాలు, చెప్పులు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులు, దుస్తులు, నోట్‌బుక్‌లు, పెన్సిల్ పెట్టెలు, నీటి ట్యాంకులు, సోలార్ దీపాలు, పారలు, స్పేడ్‌లు, పాత్రలు, క్రీడా సామాగ్రి (క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్) పంపిణీ చేశారు. దీనితో పాటు, నిరుపేదలకు సైకిళ్లను కూడా అందజేశారు. అడవి గ్రామాల్లోని ఆదివాసి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రతో మండల్ (CMO) గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. అరన్పూర్ గ్రామ పంచాయతీ, పొట్లిల గ్రామాల ప్రజలకు LED టెలివిజన్లు, 50 స్టీల్ ప్లేట్లు, గ్లాసులను కూడా అందించారు. ఈ సందర్భంగా 231వ బెటాలియన్ కమాండెంట్ సునీల్ భావర్ మాట్లాడుతూ... గ్రామస్తులు తమ పిల్లలకు చదువు చెప్పి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిఆర్‌పిఎఫ్ లక్ష్యం భద్రత కల్పించడమే కాకుండా గ్రామస్తులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సోలంకి విజయ్ కుమార్ మనోహర్ రావు, రాజేష్ జిల్లా సభ్యుడు, అరన్పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్, సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.