10-03-2025 08:11:02 PM
– తాటి చెట్టుపై నుంచి కింద పడిన వారికి ఉచిత చికిత్స..
– ఇప్పటి వరకు 66 మందికి.. రూ. 2 కోట్లతో ఉచిత వైద్యం..
– సుప్రజ దవాఖాన మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్..
ఎల్బీనగర్: వృత్తి ఉపాధిలో భాగంగా ప్రాణాలను పణంగా పెట్టి కల్లు గీసే గీత కార్మికులు ప్రమాదాల బారిన పడితే.. వారికి తమ ఆస్పత్రి ఎల్లవేళలా అండగా ఉంటుందని సుప్రజ దవాఖాన మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల జనగామ జిల్లాకు చెందిన ముగ్గురు గీత కార్మికులు, వేరే ప్రాంతానికి చెందిన మరొకరు.. మొత్తం నలుగురు ఒకే రోజు తాటిచెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయాలై నాగోల్‌లోని సుప్రజ దవాఖానలో చేరగా.. వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు చికిత్స పొందుతున్న వారిని సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం, బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుప్రజ దవాఖాన ఎండీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. 2022లో యాదగిరిగుట్టలో కల్లుగీత కార్మికుల మహాసభలో ఇచ్చిన మాట ప్రకారం.. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా గీత కార్మికులు చెట్టు మీద నుంచి జారి పడి వస్తే వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అలా మూడేండ్ల కాలంలో ఇప్పటి వరకు 66 మంది కార్మికులకు రూ. 2కోట్ల రూపాయలు భరించి వారి ప్రాణాలు కాపాడామని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా ఇప్పటి వరకు రూ. 10 లక్షలకు పైగా భరించామని విజయ్‌కుమార్ తెలిపారు. గౌడ వృత్తి గాలిలో వేలాడుతూ.. ఉపాధి పొందే ప్రమాదకరమైన వృత్తి, ఈ వృత్తిలో ఉన్న ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం వారికి పలు రకాల సౌకర్యాలు కల్పించాలని విజయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ... గీత కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు ఉచిత వైద్యం అందిస్తున్న సుప్రజ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. కాటమయ్య కిట్లు ఆవిష్కరణ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 15 వేలు మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా రాష్ట్రంలో 2లక్షల 50 వేల మందికి పంపిణీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో 360 మంది గీత కార్మికులు తాటి చెట్టు మీద నుంచి కిందపడ్డారని, అందులో 42 మంది కార్మికులు చనిపోయారని తెలిపారు. గీత కార్మికుల ప్రాణాలు కాపాడలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి బడ్జెట్ కేటాయించి సేఫ్టీ కిట్లను ఇవ్వాలన్నారు. చనిపోయిన, చెట్టు మీద నుంచి పడిన గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి ఉదయ్‌కుమార్, డాక్టర్లు, బాధితుల బంధువులు, గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.