21-02-2025 12:00:00 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
మేడ్చల్, ఫిబ్రవరి 20: హైదరాబాద్ నగరానికి వచ్చిన పాలమూరు బిడ్డలకు అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్నంలో ‘పాలమూరు బిడ్డలు.. సంక్షేమ సంఘం’ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ముంబయ్, పుణే నగరాలలోనే కాకుండా దేశ విదేశాల్లో అనేక ఆకాశ హర్మ్యాలు నిర్మించిన కూలీలు పాలమూరు కార్మికులేనన్నారు.
ఎక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తే అక్కడికి వెళ్లి కూలీ పని చేసుకునే జీవించే నిస్వార్థ జీవులు వారన్నారు. నగరంలో పొట్టకూటి కోసం వచ్చి లక్షలాది సంఖ్యలో నివాసం ఉంటున్న పాలమూరు వాసుల కష్ట సుఖాలు,
సంక్షేమం కోసం పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమసంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక సభ్యులు శ్రీధర్ పంతులు, రవీందర్, సంకి సత్యం, గోపాస్ చంద్రశేఖర్, బంగారి బండి, కుర్మయ్య, రాములు, లోకేష్‌రెడ్డి, ప్రదీప్ రెడ్డి, గోపాల్, సాయి తదితరులు పాల్గొన్నారు.