calender_icon.png 24 October, 2024 | 7:54 AM

స్వదేశీ విధానాలతోనే అగ్రగామిగా నిలుస్తాం

24-10-2024 01:50:54 AM

స్వదేశీ మేళా ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి):  స్వదేశీ విధానాల ద్వారానే భారత్ ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంభి భారత్ అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 27 వరకు కొనసాగనున్న స్వదేశీ మేళా మెగా జాబ్ ఫెయిర్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మన వనరులను సమీకరించుకుని, వినియోగించుకోవడం ద్వారా మనం బలోపేతం అయ్యే మార్గాన్ని స్వదేశీ భావజాలం బోధిస్తుందన్నారు. స్వదేశీ విధానం స్వచ్ఛమైన భారతీయ ఆత్మతో కూడుకుంటుందన్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి మొదలుకొని వికసిత భారత ప్రయాణం వరకు ప్రతి అంశం స్వదేశీ ఆలోచన విధానంతో ముడిపడి ఉందన్నారు.

గత 30 ఏళ్లుగా స్వదేశీ జాగరణ మంచ్ స్వదేశీ మేళాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. అనంతరం స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ సీఏఆర్ సుందరం మాట్లాడుతూ.. స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంభి భారత అభియాన్ సంస్థలు స్వదేశీ ఉత్పత్తుల ప్రాచుర్యాన్ని దేశవ్యాప్తంగా మహోద్యమంలా వోకల్ ఫర్ లోకల్ నినాద స్ఫూర్తితో కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

ఈ మేళాలో 350 స్టాల్స్‌తో స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాగా, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాలో 16 వేల మంది పాల్గొనగా, 3 వేల మంది ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. రెండో రౌండ్‌కు మరో 4,500 మంది ఎంపికైనట్టు చెప్పారు.

కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ హరీశ్ బాబు, గంగోత్రి డెవలపర్స్ చైర్మన్ మధురాంరెడ్డి, స్వావలంభి భారత్ అభియాన్ ప్రాంత కన్వీనర్ జీ రమేష్ గౌడ్, స్వదేశీ మేళా కన్వీనర్ ఇంద్రసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.