- ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- దీపావళిలోపు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నందున ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చొరవతో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను సీఎంకు వివరించారు.
సానుకూలంగా స్పందించిన రేవంత్‌రెడ్డి దీపావళిలోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని, సమావేశానికి ఆదివాసీ సంఘాల ముఖ్యులను పిలిచి చర్చిస్తామని తెలిపారు. ఆదివాసీల డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేసి అక్కడి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న దివ్య దేవరాజన్‌ను అక్కడికి పంపించి చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.