- మంత్రి పొన్నం ప్రభాకర్
- హుస్నాబాద్‌లో కాటమయ్య సేఫ్టీ కిట్ల పంపిణీ
హుస్నాబాద్, నవంబర్ 16: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్లు, చెరువుకుంటలు, కాల్వగట్లపైన సగానికి పైగా తాటి, ఈత వనాలే ఉండాలని.. ప్రభుత్వ భూములతోపాటు ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా అక్కడ విరివిగా తాటి, ఈతచెట్లను నాటాలన్నారు. శనివారం ఆయన సిద్ధ్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గీత కార్మికుల రక్షణ కోసం ఐఐటీ ఇంజినీర్లు తయారుచేసిన కాటమయ్య సేఫ్టీ కిట్లను వినియోగించుకో వాలన్నారు. త్వరలో గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా బకాయిలు చెల్లించడంతోపాటు వారికి మోపెడ్‌లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.