ఆసిఫాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థులతో డీఎంఈ వాణి
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మెడికల్ కళా నెలకొన్న సమస్యలపై గత రెండు రోజులుగా విద్యార్థులు చేస్తున్న అందోళనకు డీఎంఈ (డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యూకేషన్) అధికారులు దిగివచ్చారు.
కళాశాలలో సరపడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో పాటు హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వైద్య విద్యార్థులు గత రెండు రోజులుగా కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఏఎస్పీ చిత్త రంజన్ అక్కడి చేరుకుని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కళాశాలకు చేరుకున్న డీఎంఈ డాక్టర్ వాణి కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరిటెండెంట్‌తో పాటు సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య విద్యార్థులు అందోళన చేస్తున్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థుల అందోళనను పక్కదారి పట్టించేందుకు విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాందుకు, ఆసుపత్రి యాజమాన్యం లోటుపట్లను కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రి సూపరిటెండెంట్ తప్పుడు సమాధానం ఇచ్చినట్టు సమాచారం.
విద్యార్థులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అందోళన చేస్తున్నారని డీఎంఈకి చెప్పినట్టు తెలిసింది. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు పిలువగా విద్యార్థులు బయటే చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల వద్దకు వచ్చిన డీఎంఈ ఒక్కొక్కరిగా సమస్యలను అడిగి తెలుసుకోవడం ఇక్కడ సాధ్యం కాదని, హాల్‌లో కుర్చుండి మాట్లాడుకుందామని నచ్చజెప్పారు. దీంతో హాల్‌లో దాదాపుగా రెండు గంటల పాటు విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వానికి నివేదించి, త్వరగా పరిష్కరించేలా చూస్తామని డీఎంఈ హామీ ఇచ్చారు.