16-03-2025 01:31:32 AM
వరంగల్, మార్చి 15 (విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, రైతులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సురేంద్రమోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ హామీ ఇచ్చారు. వరంగల్ మార్కెట్‌లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కల్పించాల్సిన సౌకర్యాలపై శనివారం హైదరాబాద్‌లో మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ సురేఖ, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో క్లీనింగ్ పూర్తి స్థాయిలో చేయిస్తామని తెలిపారు. సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడమే కాకుండా వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. చాంబర్ కార్యాలయానికి సదస్సులు నిర్వహించేందుకు కేటాయించిన 35 గుంటల స్థలానికి నామమాత్రపు లీజు నిర్ణయించి కార్యాలయ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
మార్కెట్ యార్డులో దొంగతనాల నివారణకు ప్రస్తుత సెక్యూరిటీని తొలగించి, కొత్త ఏజెన్సీని సత్వరమే నియమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కటకం పెంటయ్య, చాంబర్ కోశాధికారి అల్లే సంపత్, కైలాస హరినాథ్, సలహాదారు వెల్ది చక్రధర్, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్‌రెడ్డి లింగారెడ్డి, కాటన్ సెక్షన్ కార్యదర్శి కట్కూరి నాగభూషణం, చిల్లిస్ సెక్షన్ కార్యవర్గ సభ్యుడు కంచ సదానందం పాల్గొన్నారు.