నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు బాబీ సినిమా విశేషాలను పంచుకున్నారు.
బాలకృష్ణ ఇమేజ్ను, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని ‘డాకు మహారాజ్’ సినిమా చేశాం. అ యితే బాలకృష్ణ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాం. బాలయ్య సెటిల్డ్‌గా డైలాగులు చెప్తే చాలా బాగుంటుంది. ‘నరసింహ నాయుడు’, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ‘సింహా’ ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాం.
బాలకృష్ణ నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌర వం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ అంతగా గౌరవిస్తారు. అభిమానులు తనను చూడ టానికి వస్తారు కదా అని డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు.
ట్రైలర్లో విజువల్స్‌కు మంచి పేరు వచ్చింది. నిర్మాత నాగవంశీ బాలకృష్ణను ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండానుకున్నారు. ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలనుకున్నాం.
డీవోపీ విజయ్ కన్నన్‌తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకు పనిచేస్తున్నారు. నాగవంశీ కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అద్భుతంగా వచ్చాయి.
సినిమాలో ఉపయోగించిన ఆయుధాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. హీరోకు ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తిమంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాశ్రీనాథ్ ఇద్దరు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వాళ్లవి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బాబీ డియోల్ పాత్ర.. రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకు న్యాయం చేయడం కోసం సెట్లో ఎంత సమయాన్నైనా కేటాయిస్తారు. బాబీ డియోల్.. ఎన్టీఆర్, బాలకృష్ణను ఎంతో గౌరవిస్తారు.