calender_icon.png 20 October, 2024 | 6:50 AM

వరదనీటి కాల్వలను పునరుద్ధరిస్తాం

20-10-2024 02:04:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నగరంలో వరద నీటి కాల్వల పునరుద్ధరణ పనులను వారం రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. వరద నీరు నిలుస్తున్న ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ స్తంభిస్తున్న ప్రాంతాలను ఆయన నగర ట్రాఫిక్ విభాగం అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్‌తో కలిసి శనివారం పరిశీలించారు. లక్డీకపూల్, రాజ్ భవన్ రోడ్లలో వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి.. వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

ద్వారాక హోటల్ ముందు నుంచి లక్కీ రెస్టారెంట్ మీదుగా భూగర్భ కాలువ ద్వారా గతంలో వరద నీరు సాఫీగా ప్రవహించేదని, ఈ కాలువ పూర్తిస్థాయిలో శిథిలమవడంతో పాటు పూడుకుపోవడంతో సమస్య తలెత్తుతోందని ఇంజినీరింగ్ అధికారులు వివరిం చారు. అనంతరం ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. గతంలో సాఫీగా సాగిన లకిడీ కా పూల్ పరిసర ప్రాంతాల్లో శిథిలమైన వరద నీటి కాలువలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను వారంలో పూర్తిచేయాలని అన్నారు.

వరద ముప్పు తప్పని పరిస్థితుల్లో ఈ వర్షాకాలానికి తాత్కాలిక చర్యలు చేపట్టి వచ్చే వేసవిలో కాలువను విస్తరించాలన్నారు. రాజ్ భవన్ రోడ్డులో నిర్మిస్తున్న 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రెయిన్ వాటర్ హోల్డింగ్ వంటి నిర్మాణాలను నగర వ్యాప్తంగా 30 వరకు చేపట్టనున్నట్లు రంగనాథ్ తెలిపారు. వారం రోజుల తర్వాత ఈ ప్రాంతాలను మరోసారి పరిశీలించి పనుల పురోగతిని సమస్య పరిష్కారం తీరు ను తెలుసుకోవాలంటూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకట నారాయణ పాల్గొన్నారు.