22-02-2025 12:15:26 AM
మాదిగలకు చోటు కల్పిస్తే ప్రభుత్వాన్ని గౌరవిస్తాం
బీఆర్‌ఎస్ హయాంలో మాదిగలకు అన్యాయం
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ముషీరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో మాదిగ ప్రజా ప్రతినిధుల్లో ఇద్దరికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిగలకు మంత్రివర్గంలో చోటులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల పేరుతో దామోదర రాజనర్సింహను మంత్రిగా కొనసాగిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఇవ్వలేదని గుర్తుచేశారు. మాదిగ ప్రజాప్రతినిధి తాటికొండ రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి కొంతకాలానికే పదవి నుంచి బర్తరఫ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్య స్థానంలో మాదిగలు కాని బైండ్ల వర్గానికి చెందిన కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మాదిగలకు అన్యాయం చేశారని వాపోయారు.
తాజాగా రేవంత్ సర్కార్ మాదిగ ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి దామోదరం రాజనర్సింహకు మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎస్సీ వర్గీకరణ కాకముందే గ్రూప్ పరీక్షలు నిర్వహించి మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలోని లోపాలను సరిచేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, లోపాలను మార్చి 10 లోపు సరిచేసి మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, తెలంగాణ విఠల్, ముస్లిం సంఘం ఐక్య వేదిక కన్వీనర్ ఇస్మాయిల్, యూనివర్సిటీ ఉద్యోగుల నేత డాక్టర్ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.