- డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు
- ఖమ్మం కలెక్టరేట్‌లో వివిధ సంఘాల అభిప్రాయాల సేకరణ
ఖమ్మం, నవంబర్ 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల అమలుపై వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరిస్తూ నివేదికను ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు తెలిపారు.
స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బహిరంగ విచారణ చేపట్టారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, సెక్రటరీ బీ సైదులు, ఖమ్మం అదనపు కలెక్టర్ పీ శ్రీనివాసరెడ్డి పొల్గొన్నారు. వివిధ కుల సంఘాలు, వ్యక్తుల నుంచి విజ్ఞాపణలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ దామాషా ఖరారు చేసేందుకు ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. రిజర్వేషన్ సంబంధిత అంశా లు మాత్రమే తెలియజేయాలని, మిగిలిన అంశాలు బీసీ కమిషన్ పర్యటనలో తెలపాలని అన్నారు.
కార్పొరేటీవ్ సొసైటీ యాక్ట్ కింద నిర్వహించే ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి రావని, ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ దామాషా అమలుపై వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అభిప్రాయాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నెల రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు వీ రమేశ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు జ్యోతి, ఇందిర, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత పాల్గొన్నారు.