వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): కాలవ్యవధిని తగ్గించి జీఎస్టీ రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ పేర్కొన్నారు. సోమవారం ఎఫ్‌టీసీసీఐ కార్యాలయంలో జీఎస్టీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు రిజ్వీ, సెంట్రల్ జీఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాశ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో సరుకులతో వెళ్తున్న వాహనాలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు రోజుల తరబడి నిర్బంధించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సరైన కారణం ఉంటేనే వాహనాలను అదుపులోకి తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు.
లోతైన అధ్యయనం తర్వాతే వెండర్స్‌ను ఎంపిక చేసుకోవాలని సందీప్ ప్రకాశ్ సూచించారు. జీఎస్టీ అధికారులు ప్రతినెలా రిటర్న్‌లు దాఖలు చేసే అంశాన్ని గుర్తుచేయడాన్ని ఆయన అభినందించారు.
జీఎస్టీ పరిధిని రూ.40లక్షలకు పెంచాలి..
జీఎస్టీ పరిధిని రూ.20లక్షల నుంచి రూ.40లక్షలకు పెంచాలని ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్ సింఘాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాత్రమే రూ.20లక్షల పరిమితి అమలులో ఉందని, దీని వల్ల చిన్నవ్యాపార సంస్థలకు భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ సాహిల్, తెలంగాణ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫాక్చర్స్ అసోసియేషన్, తెలంగాణ, ఏపీ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం, హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్‌తో పాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.