calender_icon.png 9 October, 2024 | 1:51 AM

10 వేల ఉద్యోగుల్ని రిక్రూట్ చేస్తాం

07-10-2024 01:02:13 AM

ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10,000 వరకూ ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. తమ సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం, టెక్నాలజీని పెంపొందించడం కోసం తాజా నియమకాలు జరుపుతామని తెలిపారు.

తమ డిజిటల్ చానళ్లను పటిష్ఠపర్చడానికి, ఖాతాదారుల సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు ఎస్బీఐ టెక్నాలజీపై గణనీయంగా పెట్టుబడి చేస్తున్నదని శెట్టి చెప్పారు. తాము ఇటీవలే ఎంట్రీలెవల్, హయ్యర్ లెవర్ రెండింటిలోనూ కలిపి 1,500 మంది టెక్నాలజీ నిపుణుల రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించామని తెలిపారు.

డేటా సైంటిస్ట్స్, డేటా ఆర్కిటెక్ట్స్, నెట్‌వర్క్ ఆపరేటర్స్ తదితర ప్రత్యేక ఉద్యోగాల కోసం కూడా తాము రిక్రూట్ చేసుకుంటున్నామని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది తమకు 8,000 నుంచి 10,000 మంది వరకూ అవసరం ఉంటుందన్నారు. 2024 మార్చినాటికి ఎస్బీఐ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,296.

ఇందులో 1,10,114 ఆఫీసర్లు ఉన్నారు. ఖాతాదారుల అవసరాలు, అంచనాలు మారుతున్నాయని, టెక్నాలజీ మారుతున్నదని, డిజిటలైజేషన్ విస్తరిస్తున్నదని, అందుచేత  ప్రస్తుత ఉద్యోగులను రీస్కిల్, అప్‌స్కిల్ చేయడంపై బ్యాంక్ దృష్టిపెట్టిందని ఎస్బీఐ చైర్మన్ వివరించారు.